రష్యా - ఉక్రెయిన్ (Russia - Ukraine Conflict) మధ్య కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో వేలాది మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ నడి మధ్యలో చిక్కుకున్న భారతీయుల విషయంలో తాము సహకారం అందిస్తున్నట్లుగా రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ బుధవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ సహా యుద్ధ వాతావరణం (Ukraine War) ఉన్న ఇతర సంక్లిష్ట ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను రష్యన్ భూభాగానికి తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వారి తరలింపునకు సురక్షితమైన మార్గం కోసం ‘‘మానవత్వంతో కూడిన కారిడార్’’ (Humanitarian Corridor) ను రూపొందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్‌ భారతీయ విద్యార్థులను బంధిస్తోందని రష్యా ఆరోపిస్తోంది.


‘‘మానవత్వ దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న ఈ  కారిడార్ ద్వారా ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థుల బృందాన్ని అత్యవసరంగా తరలించడానికి రష్యా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో, ఈ విద్యార్థులను ఉక్రేనియన్ భద్రతా దళాలు బందీలుగా పట్టుకున్నాయి’’ అని రష్యా మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.


మాస్కోలో (Mascow) రష్యా రాయబారి అయిన డెనిస్ అలిపోవ్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతకు సంబంధించిన అంశంపై రష్యా భారత్‌తో సంప్రదింపులు జరుపుతూ ఉందని, వారి తరలింపునకు సురక్షితమైన మార్గం త్వరలో అందుబాటులోకి వస్తుందని అన్నారు.


పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ (Putin Modi Phone Talk)
మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (Vladimir Putin) ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2 రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని ఘర్షణ ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై ఇరువురు నేతలు చర్చించారని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో, ముఖ్యంగా చాలా మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్న ఖార్కివ్ నగరంలో పరిస్థితిని ఇద్దరు నాయకులు సమీక్షించారు’’ అని అధికారిక ప్రకటనలో తెలిపారు.


అంతకుముందు రోజు, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు అత్యవసరంగా ఖార్కివ్ నుంచి కాలినడకన కూడా సమీపంలోని మూడు దేశాలకు సరిహద్దులు దాటి వెళ్లమని భారత్ కోరింది. అయితే తాజాగా రష్యా ప్రాబల్యంలో ఉన్న ఉక్రెయిన్ ఘర్షణ ప్రాంతాల నుండి భారతీయులను తరలించడానికి "ప్రత్యేక కారిడార్లు" ఏర్పాటు చేస్తామని రష్యా హామీ ఇచ్చింది.