Spirituality: దైవారాధనకు ప్రత్యేక రోజులు, ప్రత్యేక ఘడియలతో పనిలేదు..ఎప్పుడైనా ఆరాధించవచ్చు. అయితే మీ జాతకంలో ఉండే గ్రహస్థితి, మీరు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యల ఆధారంగా ఏ రోజు పూజచేస్తే అనుకూలమో తెలుసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందుతారు.  


ఆదివారం


కంటికి, చర్మానికి సంబంధించిన వ్యాధులున్నవారు...వివాహం, సంతానానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఆదివారం వ్రతం ఆచరించడం మంచిది. సూర్యభగవానుడి రోజుగా చెప్పే ఆదివారం సూర్యారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఆదిదేవుడి అనుగ్రహం ఉంటే గ్రహాల ప్రతికూల ప్రభావం మీపై ఉండదు. ఈ వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం రోజు ప్రారంభించి కనీసం 12 వారాల పాటూ విధిగా ఆచరించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకు స్నానం ఆచరించి..ఆదిత్యహృదయం పారాయణం చేయాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు భోజనం చేయాలి. 


సోమవారం


భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. మనసుని నియంత్రించే చంద్రుడిని ప్రశన్నం చేసుకునేందుకు కూడా సోమవారం అత్యుత్తమమైనది. సోమవార వ్రతం చేయాలి అనుకుంటే శ్రావణం, వైశాఖం, కార్తీకం, మార్గశిర మాసాల్లో పౌర్ణమి ముందు వచ్చే సోమవారం ప్రారంభించి 16 వారాలు విధిగా ఆచరించాలి.  ఈ వ్రతం చేయాలి అనుకుంటే చెరువు, నది, కొలను, సముద్రం లేదంటే బావి వద్ద అయినా స్నానం ఆచరించి రోజంతా పంచాక్షరి మంత్రం జపించాలి. బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి. చంద్రుడి అష్టోత్తరం పఠించాలి. చంద్రుడి ప్రతికూల ప్రభావం తొలగించుకునేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరం ధరించాలి. వ్రతం ముగించే చివరివారం దంపతులకు వస్త్ర దానం చేయాలి.  


Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!


మంగళవారం


హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం వ్రతం ఆచరిస్తారు. జాతకంలో కుజ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగించుకునేందుకు మంగళవారం వ్రతం చేస్తారు. ఏ నెలలో అయినా పౌర్ణమి ముందు వచ్చే మంగళవారం వ్రతం ప్రారంభించి 21 వారాలు ఆచరించాలి. మంగళవారం వ్రతం చేస్తే ఆరోగ్యం, ఆయుష్షు, శత్రుజయం ఉంటుంది. దీర్ఘకాలిన వ్యాధులు, అప్పుల బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పూజలో భాగంగా ఆంజనేయుడిని ధ్యానంతో పాటూ కుజాష్టోత్తరం పఠించాలి 


బుధవారం
 
 శ్రీమహావిష్ణువు అనుగ్రహం కావాలి అనుకున్నవారు బుధవారం వ్రతం ఆచరిస్తారు. గ్రహాల రాకుమారుడిగా పిలిచే బుధుడి ప్రతికూల ప్రభావం తగ్గించుకునేందుకు బుధవారం వ్రతం ఆచరిస్తారు. ముక్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారంలో వెనుకబడేవారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఏ నెలలో అయినా పౌర్ణమి ముందు వచ్చే బుధవారం వ్రతం ప్రారంభించి 21 వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం వ్రతాన్ని ఆచరించేవారు వంటకాల్లో ఉప్పు తినకూడదు. ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు,పానీయాలు మాత్రమే స్వీకరించాలి. పెసలు నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. 


గురువారం


మానసిక ప్రశాంతత లేదు అనుకున్నవారు గురువారం వ్రతం ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమకు నచ్చిన గురువును ఈ రోజు ఆరాధించవచ్చు. గుర గ్రహం ప్రతికూల ప్రభావం ఉంటే విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అన్నీ వ్యతిరేక ఫలితాలే ఉంటాయి...పైగా అడుగడుగునా అవమానాలు , అవహేళనలు తప్పవు. అందుకే బృహస్పతిని ప్రశన్నం చేసుకునేందుకు గురువారం వ్రతం ఆచరించాలి. ఏ నెలలో అయినా శుక్లపక్షంలో గురువారం ఈ వ్రతాన్ని ప్రారంభించి 16 వారాలు ఆచరించాలి. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి...పసుపు పూలతోనే పూజచేయాలి.  గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పు వినియోగించరాదు.. ఒక్కపూటే భోజనం చేయాలి.


Also Read: ఆర్థిక సమస్యలు, నరఘోష , శత్రుభయం నుంచి విముక్తి కల్పించే సంకష్టహర చతుర్థి వ్రతం - ఎలా చేయాలంటే!


శుక్రవారం


శుక్రవారం దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి సహా అమ్మవార్లకు అంకితం అయ్యే రోజు. అమ్మ అనుగ్రహం పొందేందుకు శుక్రవారం వ్రతాన్ని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ప్రారంభించి...16 వారాలు చేయాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శుక్రవారం వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒకపూట భోజనం చేయాలి...శ్రీసూక్త పారాయణ చేస్తూ తెలుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాలి.  


శనివారం


కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందాలి అనుకున్నవారు శనివారం వ్రతం ఆచిరిస్తారు. జాతకంలో ఉండే రాహు, కేతు ,శని సంబంధిత దోషాలు తొలగిపోయేందుకు శనివారవ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో వచ్చే తొలి శనివారం ప్రారంభించి..19 వారాల పాటూ ఆచరించాలి. నువ్వుల నూనె లేదా ఆవునెయ్యితో దీపం వెలిగించి నీలం రంగు పూలతో పూజించాలి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి ఉపవాసం లేదంటే ఒకపూట భోజనం చేయాలి. ఈ వ్రతం పూర్తైన ఆఖరివారం నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం దానం ఇవ్వాలి.  


Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!