పురాణాల్లో ఎక్కువగా వినిపించే మాట..నీ దర్శనంతో నా జన్మధన్యమైంది, పునీతులం అయ్యా అని.పునీతులం అవడం అంటే అదేమైనా హోదానా అంటే..ఇంచుమించు అలాంటిదే. ఎందుకంటే మన ప్రవర్తనతో సంపాదించుకునే ప్రత్యేక హోదా అది.
పునీతాలను ఐదు రకాలుగా చెబుతారు
1. వాక్ శుద్ధి
2. దేహ శుద్ధి
౩. భాండ శుద్ధి
4. కర్మ శుద్ధి
5. మనశ్శుద్ధి
Also Read: రక్షా బంధన్ కుడిచేతికి కట్టడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
వాక్ శుద్ధి
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన భగవంతుడు మాట్లాడే వరాన్ని కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాడు . అందుకే వాక్కును దుర్వినియోగం చేయకూడదు . పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు . ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే మీరు పక్కకు తప్పుకోండి కానీ వాదన పెట్టుకుని మాట తూలకుండా ఉండటమే వాక్ శుద్ధి.
దేహ శుద్ధి
మన దేహమే దేవాలయం అంటారు.అంటే శరీరం అంత పవిత్రమైనదని అర్థం. దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుతామో శరీరాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి.రెండు పూటలా స్నానం చేయాలి..చిరిగిన, అపరిశుభ్రమైన దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు. అలా చేస్తే ఈ ఇంట దరిద్రం తాండవిస్తున్నట్టే...
Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1
భాండ శుద్ధి
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం . అందుకే ఆహారాన్ని వండే పాత్ర, అందించే పాత్ర కూడా పరిశుభ్రంగా ఉండాలి . స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతంతో సమానం అంటారు పెద్దలు. స్నానం చేయకుండా వండి ఆహారం తిన్నవారికి రాక్షస లక్షణాలు వస్తాయంటారు.
కర్మ శుద్ధి
కర్మ అంటే పని. ఏదైనా పని చేయాలని అనుకుంటే ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలి. మధ్యలో ఆపితే వారిని అధములు అని, అనుకున్న పనిని అస్సలు ప్రారంభించని వారిని అధమాధముడు అని... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడని అంటారు.
మనశ్శుద్ధి
మనస్సును ఎప్పుడూ ధర్మం , న్యాయం వైపు మళ్ళించాలి . ఎందుకంటే చంచలమైన మనసు ఎప్పుడూ వక్రమార్గానికే ఆకర్షణ చెందుతుంది..అలాంటప్పుడే సమస్యలొస్తాయి, కష్టం కలుగుతుంది, అయినవారిని బాధపెట్టిన వారవుతారు. అందుకే ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి .
ఈ ఐదురకాలైన శుద్ధిని కలిగి ఉంటే చాలు... మీ జీవితానికి మీరే రాజు-మీరే మంత్రి.మీకెవరూ శత్రువులుండరు, మీరెవ్వరికీ శత్రువు కారు. భాండ శుద్ధి ఉంటే ఆనారోగ్యం దరిచేరదు. అందుకే పంచపునీతాలు సక్రమంగా పాటిస్తే చాలు మీ జన్మ ధన్యమైనట్టే.