Simhachalam Chandanotsavam 2023: ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు సింహాచల  నారసింహ స్వామివారికి చందనోత్సవం చేస్తారు.  దీనివెనుక భారీ కసరత్తు చేస్తారు



  • స్వామివారికి చందనపు పూతను పూసేందుకు అవసరమయ్యే గంధపు చెక్కలని తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు

  • జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని ఇందుకు వినియోగిస్తారు

  • చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి, గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలుపెడతారు తెల్లవారితే అక్షయ తృతీయ అనగా..ముందు రోజు అర్థరాత్రి నుంచే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు

  • చందనాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్షయతృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.  నారసింహస్వామి నిజరూపాన్ని మొదట దర్శించుకునే భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులదే

  • అక్షయతృతీయ రాత్రి వరకూ భక్తుల దర్శనం సాగిన తర్వాత స్వామివారి అభిషేకం మొదలవుతుంది. ముందుగా సింహాచలం కొండ మీదున్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో ‘సహస్ర ఘటాభిషేకాన్ని’ నిర్వహిస్తారు

  • సహస్ర ఘటాభిషేకం తర్వాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తారు

  • మూడు మాణుగలు అంటే 120 కిలోల చందనాన్ని నారసింహస్వామివారికి లేపనంగా పూస్తారు.

  • ఆ చందనం పూతతో స్వామివారు నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారతారు


Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!


ఈ చందనపు పూత ఏడాదికి ఓసారి మాత్రమే జరిగే క్రతువు కాదు..సంవత్సరానికి నాలుగుసార్లు చొప్పున ఒక్కోసారి మూడు మణుగుల చందనం... మొత్తంగా 12 మణుగుల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. దాదాపు 500 కిలోల చందనాన్నీ అక్షయ తృతీయ సందర్భంగా ఒలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.



‘పాహీ! శ్రీమన్నారాయణ!’ అని ప్రహ్లాదుడు పిలవగానే, గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నారసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడి తదనంతరం  కాలక్రమంలో వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి  అక్క డే బస చేయడంతో...స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు. పురారవ చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు..రెండో రోజు మళ్లీ కనిపించిన స్వామివారు తాను 12 అడుగులున్న పుట్టలో ఉన్నానని చెబుతాడు. అలా స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చెబుతారు. స్వామి 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. అలా పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ  ఏటా అక్షయ తృతీయనాడు  వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది.