Sadar Festival 2022: భిన్న సంస్కృతి, సంప్రదాయానికి ఆలవాలం హైదరాబాద్. ఏటా సరిగ్గా దీపావళి సమయానికి జంటనగరాలు మరో భిన్నమైన ఉత్సవాలు జరుపుకోవడానికి ముస్తాబవుతాయి. ఇంతకు ఏంటా ఉత్సవాలు అనేకదా..అవేనండీ సదర్ ఉత్సవాలు. దీన్నే వృషభోత్సవం అని కూడా అంటారు. యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే ఆ ఉత్సవాల నిర్వహణ వెను పెద్ద చరిత్రే ఉంది.
ప్రాంతానికో పేరు: సింధు నాగరికత ప్రారంభం నుంచి ఈ సదర్ ఉత్సవం ఉందట. అయితే అది క్రమక్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతూ వచ్చి, వివిధ రకాల పేర్లతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయింది. గతంలో ఈ ఉత్సవాన్ని వివిధ యాదవ రాజ వంశీయులు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ పండుగను ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలలో 'పోలా' అని, కర్ణాటక రాష్ట్రంలో 'కంబాల'ని, తమిళనాడులో 'జల్లికట్టు' , నేపాల్లో 'మాల్వి' అని అంటే, ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే దీన్ని 'సదర్' గా పిలుస్తున్నారు.
సదర్ చరిత్ర: కాకతీయ రాజుల కన్నా ముందే యాదవులు ప్రస్తుతమున్న అప్పట్లో గొల్లకొండగా పిలిచే గోల్కొండను కేంద్రంగా చేసుకుని జీవించేవారని చరిత్ర చెబుతోంది.. ముస్లింరాజుల పరిపాలనలో యాదవ వీరులు మొగలులు, కుతుబ్ షాహి మరియు నిజాంల కాలంలో సైన్య అధికారులుగా అంగరక్షకులుగా సమర్థవంతంగా పనిచేశారు. నిజాం వారి సేవలను గుర్తించి గౌలిగూడ ఒకప్పుడు దీన్ని గొల్లగూడ అనేవారు. అక్కడ పాల ఉత్పత్తులు ఎక్కువగా అమ్మడం వల్ల ఆ పేరొచ్చింది. ఆ ఈనామ్ ఇచ్చాడని చరిత్ర చెబుతుంది. అక్కడ నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అంటారు. మరి కొందరు సైదాబాద్ ఏరియాలో మొదటగా ప్రారంభమయ్యాయని చెబుతుంటారు.
Also Read: దేవతల వైద్యుడిని నిత్యం స్మరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి!
దీపావళి పండుగ నాటికి వ్యవసాయ పనుల్లో దున్న రాజులు, గేదెలు , ఆవులతో చేసే పని చివరిదశకు వస్తుంది. అప్పుడు ఇవి విశ్రాంతిగా పుష్టిగా తిని తమ సంతతిని పునరుత్పత్తి చేసే దశకు చేరుకుంటాయి. మేలు జాతి జంతువులను ఉత్పత్తి చేసే క్రమంలో ఈ పండుగ పుట్టుకొచ్చింది. అప్పట్లో వందలు వేలాదిగా తరలివచ్చే దున్న రాజుల అన్నింటిలో మేలు రకమైన జాతిని ఎన్నుకుని ఆ దున్న రాజును దాని యజమాని ఘనంగా సత్కరించి , ఆ దున్న రాజులను, గేదెలతో క్రాస్ చేయించి మేలు జాతి దూడల ఉత్పత్తి చేసేవారు. ఈ విధంగానే ఆంధ్ర ప్రాంతంలో కాటమరాజు యాదవ్ అనే వ్యక్తి ఒంగోలు గిత్త అనే బ్రీడును, కృష్ణా పరివాహక ప్రాంతాలలో మల్లన్న, బీరప్ప లు మేలిమి జాతి దక్కనీ గొర్రెలను వృద్ధి చేశారు. ఈ ఒంగోలు గిత్తలు మరియు దక్కనీ గొర్రెలు ప్రపంచంలోనే పేరు ప్రతిష్టతలు పొందాయి.
Also Read: దీపావళి రోజు దక్షిణావర్తి శంఖాన్ని ఎలా పూజించాలి, ఆ తర్వాత దానిని ఏం చేయాలంటే!
సదర్ ఉత్సవాన్నిచాలా ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి డప్పుల శబ్దాలతో డాన్సులతో దున్న రాజులు బయలుదేరి తన చురుకుదనాన్ని, బలిష్టతను ప్రదర్శిస్తాయి.వాటిని ప్రధానంగా దాని వెనుక కాళ్లపై నిలబడేలా చేస్తారు. అందులో భాగంగా ఏ దున్నపోతైతే ఎక్కువ ఎత్తుకు తన ముందుకాళ్ళను లేపుతుందో ఆ దున్నపోతుకు బహుమతి ప్రదానం చేస్తారు.
మామూలుగా మనకు లక్ష్మీ పూజ గురించి తెలుసు. కానీ యాదవులకు ఈ సదరు ఉత్సవమే లక్ష్మీ పూజలాంటింది. ఎందుకంటే వారిది ఎక్కువగా పాల వ్యాపారమే. దున్నపోతులు, ఆవులు, గొర్రెలే వారికి అన్నంపెట్టే తల్లులు. కాబట్టి అవే వారికి లక్ష్మీ. అందుకనే ప్రత్యేకించి సదరు ఉత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలతో అందంగా అలంకరంచి పండుగలా జరుపుకుంటారు.