CBI Ex JD Lakshmi Narayana : రైతులు చేపట్టిన అమరావతి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజ్యాంగ బద్ధంగా అనుమతి తీసుకుని వెళ్తున్న వారిని ఏవో కారణాలతో అడ్డుకోవడం సరికాదని, రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు ఇది వరకే తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అమరావతి పాదయాత్రతో పాటు 3 రాజధానుల అంశంపై సైతం లక్ష్మీనారాయణ స్పందించారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 


విశాఖను ఐటీ క్యాపిటల్ చేయండి 
అమరావతి పాదయాత్ర అంశం సుప్రీంకోర్టులో ఉంది. పైగా ఏపీ ప్రభుత్వమే అప్పీల్ కు వెళ్లిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం తీర్పుల కోసం ఎదురుచూడకుండా, నిర్ణయాలు తీసుకుంటూ అవరోధాలు కలిగించడం సబబు కాదన్నారు. విశాఖను రాజధాని చేయడం కాదు, ఐటీ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని సూచించారు. ఐటీ కంపెనీలు విశాఖకు తరలివస్తే రాష్ట్ర యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వస్తాయన్నారు. మూడు ప్రాంతాలు, మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో నాలుగు బిల్డింగ్ లు కడితే అభివృద్ధి జరిగినట్లేనా అని ప్రశ్నించారు. ప్రజలకు సరైన మౌలిక వసతులు కల్పించడం, ఉద్యోగాలు వచ్చేలా చేసినప్పుడే రాష్ట్రంలో ప్రగతి సాధించినట్లని, అన్ని జిల్లాలు డెవలప్ కావాలని ఆకాంక్షించారు.


26 అభివృద్ధి రాజధానులు కావాలి  
భవనాలు కట్టడం, రాజధానులు ఏర్పాటు చేయడం కాదు, నిర్ణయాలు ముఖ్యమన్నారు. రాష్ట్రానికి 26 అభివృద్ధి రాజధానులు కావాలని, ప్రతి జిల్లా ఓ అభివృద్ధి రాజధానిగా మారాలని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే భేటీ అయ్యామని చెబుతున్నారు. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం, ఎన్నికల సమయంలో సరైన ప్లాన్ తో వస్తామని చెప్పారు. అసెంబ్లీలోనైనా, లేక పార్లమెంట్ లోనైనా రాష్ట్ర ప్రజల వాయిస్ వినిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. 


600 మంది మాత్రమే పాల్గొనాలి: హైకోర్టు  
అమరావతి రైతుల పాదయాత్రలో పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొనవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. వారు రోడ్డుకు ఇరవైపులా నిలబడి మద్దతు తెలియచేయవచ్చునని.. కానీ పాదయాత్రలో పాల్గొనవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్రలో కేవలం నాలుగు వాహనాలు మాత్రమే వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు ఉందని కూడా హైకోర్టు తెలిపింది.  నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
 
అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పసలపూడిలో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 600 మందిని మాత్రమే పాదయాత్రకు అనుమతిస్తామని తెలిపారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, అమరావతి రైతులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మహిళా రైతులు కొందరు కిందపడిపోయారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు ఎక్కడికక్కడ నల్ల బెలూన్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.