Rudrabhishek: శ్రావణ మాసం శివుని ఆరాధించడానికి, పంచాక్ష‌రీ పారాయ‌ణానికి, ఉపవాసం చేయడానికి చాలా ప్రత్యేకమైన మాసంగా పరిగణిస్తారు. శ్రావణ మాసం హిందూ ధ‌ర్మంలో ప‌ర‌మేశ్వ‌రునికి ప్రీతిక‌ర‌మైన మాసంగా, అత్యంత‌ పవిత్ర మాసంగా భావిస్తారు. హిందూ ధ‌ర్మంలో శివ‌పూజ‌లో రుద్రాభిషేకం ఒక ముఖ్యమైన ఆచారంగా కొన‌సాగుతోంది, రుద్రాభిషేకంలో భాగంగా శివలింగాన్ని వివిధ ప‌దార్థాల‌తో భక్తితో అభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం త్వ‌ర‌గా లభిస్తుంది. అయితే నియమానుసారంగా రుద్రాభిషేకం చేస్తేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి రుద్రాభిషేకానికి కావలసిన సామగ్రి ఏమిటో, దానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.


నీటితో రుద్రాభిషేకం
శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నీరు ఒకటి. ఈ కారణంగా శివలింగంపై ఎప్పుడూ నీరు ప‌డుతుంది. శ్రావణ మాసంలో శివునికి నీటితో రుద్రాభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయని విశ్వాసం. చ‌క్క‌గా పంట‌లు పండేందుకు స‌మృద్ధిగా వర్షాలు కుర‌వాల‌ని భూత‌నాథుడైన శంక‌రుడిని పూజిస్తూ జలాభిషేకం కూడా చేస్తారు. అయితే, శివలింగానికి స్వచ్ఛ‌మైన, చల్లని నీటిని సమర్పించాలని గుర్తుంచుకోండి.


Also Read : శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?


నెయ్యితో రుద్రాభిషేకం
శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే ఆ కుటుంబానికి శాంతి చేకూరుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి, ఆనందం, సౌభాగ్యం నెల‌కొంటుంది. కుటుంబాభివృద్ధికి శ్రావణ మాసంలో శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయాలి.


పుణ్య జ‌లంతో రుద్రాభిషేకం
మీరు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలంటే, శ్రావణ మాసంలో శివునికి తీర్థయాత్ర చేసి తెచ్చిన పవిత్ర జలంతో రుద్రాభిషేకం చేయాలి. పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి నీటిని తెచ్చి, శివునికి అభిషేకం చేస్తే, ఆ వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.


తేనెతో రుద్రాభిషేకం
శివలింగానికి తేనెతో రుద్రాభిషేకం చేస్తే, శివుడు సమాజంలో మన గౌరవాన్ని పెంచుతాడు. ఉద్యోగ రంగంలో పురోభివృద్ధి, ప‌దోన్న‌తి, ఉన్నత స్థానం పొందుతారు. విద్యాభివృద్ధి క‌లుగుతుంది. చేప‌ట్టిన‌ అన్ని కార్యాలలో విజయం పొందడానికి శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి.


పంచామృతంతో రుద్రాభిషేకం
శివలింగానికి పంచామృతాలతో కూడిన రుద్రాభిషేకం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీకు ఏదైనా కోరిక ఉంటే, ఆ కోరికను నెరవేర్చుకోవ‌డానికి మీరు శివలింగానికి పంచామృత అభిషేకం చేయాలి. పంచామృత అభిషేకం చేయ‌డం వ‌ల్ల మీ ప్రతి కోరికను నెరవేరుతుంది.


Also Read : శ్రావణ మాసంలో ఏ శివ‌లింగాన్ని ఎలా పూజించాలో తెలుసా? ఇలా పూజిస్తే విశేష ఫ‌లితాలు ల‌భిస్తాయి


చెరుకు రసంతో రుద్రాభిషేకం
శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో చెరకు రసం ఒకటి. మీరు చాలా కాలంగా ఆర్థిక‌ సమస్యల‌తో సతమతమవుతున్నా లేదా అప్పుల ఊబిలో కూరుకుపోయినా శ్రావణ మాసంలో శివలింగానికి చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.