The Conversation of Ravana and Sita :  సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణుడు లంకలో అశోక వనంలో ఉంచుతాడు. సీతాదేవిపై అత్యంత వ్యామోహం పెంచుకున్న రావణుడికి ఓ తెల్లవారుజామున ఠక్కున మెలుకువ వచ్చింది. చెప్పలేనంత కామం కలిగింది. అప్పటికప్పుడే పాన్పుపైనుంచి లేచి సీత దగ్గరకు బయలుదేరాడు. ఆ రాత్రి రావణుడితో క్రీడించిన స్త్రీలంతా కూడా లంకాధిపతిని అనుసరించారు. ఆ స్త్రీలలో ఒకరు బంగారుపాత్రలో మద్యం తీసుకెళ్లింది..మరో స్త్రీ ఆయన  ఉమ్మివేసే పాత్ర పట్టుకుంది. ఇంకొకరు గొడుగు పట్టారు, మరికొందరు మంగళవాయిద్యాలు వాయిస్తూ, కత్తులు పట్టుకుని ..ఇలా ఒక్కొక్కరు సపర్యలు చేస్తూ రావణుడి వెంట సాగారు. కానీ ఇవేమీ రావణుడికి పట్టడం లేదు.. కళ్లముందు సీతాదేవి రూపం, ఆమెను వశపర్చుకోవాలనే విపరీతమైన వాంఛ మాత్రమే ఉంది. ఇంతమంది పరివారంతో ఓ స్త్రీపట్ల తన కామాన్ని వ్యక్తం చేయడానికి బయలుదేరాడు రావణుడు. 


Also Read: శూన్యమాసంలో అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తమా!


ఉద్రేకం కలిగించే ఏ అవయవం కనిపించకుండా జాగ్రత్త పడిన సీతమ్మ


అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడి ఆలోచనల్లో మునిగితేలిన సీతాదేవి..రావణుడి రాకను గమనించింది. ఇలాంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవం కనపడితే ఏ ప్రమాదమో అని ఆలోచించింది. స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అవేమీ కనిపించకుండా జాగ్రత్తగా కప్పుకుని మోకాళ్లని ముఖానికి ఆనించి చేతులతో ముడుచుకుని కూర్చుంది. 


రావణుడి తేజస్సు నేరుగా చూడలేకపోయిన హనుమ


తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు..సీతాదేవి దగ్గరకు వచ్చాడు. ఆ తేజస్సుని చూడలేక హనుమంతుడు చెట్టు లోపల కొమ్మల్లోకి వెళ్లి ఆకులు అడ్డుపెట్టుకున్నాడు. ఆ ఆకుల మధ్యనుంచే రావణుడిని మొదటిసారిగా చూశాడు ( సీతాదేవి జాడకోసం ఆంజనేయుడు లంకకు వెళ్లిన సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆ సమయంలో హనుమంతుడు సీతాదేవి కూర్చున్న చెట్టుపైనే ఉన్నాడు)


Also Read: పరస్త్రీ నీడ కూడా సోకనివ్వక పోవడం అంటే ఇదే - అందుకే రాముడు ఏకపత్నీవ్రతుడు!


రావణుడు


సీత! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలున్నాయి...ఓ పిరికిదాన! నీకెందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఎవరొస్తారు...100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పుచేయడానికి భయపడతావు ఎందుకు? ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను నా ధర్మాన్ని పాటించాను ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం కొంతకాలం మాత్రమే ఉంటుంది..నువ్వు చెట్టు కింద కూర్చుని ఇలాగే ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణకాలం..కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి. ఎందుకిలా మలినమైన బట్ట కట్టుకుని, నేలపై నిద్రపోతూ ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణాలు ఉన్నాయో, వస్త్రాలు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. దీనుడిగా అడవులు పట్టుకుని తిరుగుతున్న రాముడికోసం ఎందుకీ తాపత్రయం, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు..దేవతలే నన్ను ఏమీ చేయలేరు అలాంటి నరుడు ఏం చేయగలడు. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని  ఎలా అనుకుంటున్నావు. హాయిగా తాగు, తిను, జీవితాన్ని అనుభవించు నా ఐశ్వర్యం మొత్తం నీదే తీసుకో...


Also Read: భరతుడు వచ్చి పిలిచినా రాముడు అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు!


సీతాదేవి


రావణుడి మాటలన్నీ విన్న సీతమ్మ ఓనవ్వు నవ్వి అప్పటికప్పుడు ఓ గడ్డిపరకను అడ్డుపెట్టుకుని (పతివ్రతా స్త్రీలు పర పురుషుడిని నేరుగా చూడరాదనే నియమంతో గడ్డిపరక అడ్డు పెట్టుకుని మాట్లాడింది సీతాదేవి) రావణుడితో ఇలా అంది. నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు ఎంతోమంది భార్యలున్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వారి భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగైనా బతకొచ్చు కానీ చనిపోవడం నీ చేతుల్లో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణంతో ఆగిపోయాను. 


Also Read: విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు - ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది!


రావణుడు


సీతాదేవి మాటలు విన్న రావణుడికి కోపం కట్టలు తెంచుకుంది...నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు ” అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి..10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతె మీరు దండించండి  అని చెప్పి వెళ్లిపోయాడు..


రావణుడిని హెచ్చరించిన భార్య


సీతాదేవి గురించి తెలిసిన రావణుడి భార్య...భర్తను  కౌగిలించుకుని  నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందం, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగం అని చెబుతుంది..కానీ కామంతో ఉన్న రావణుడికి ఆ మాటలు చెవికెక్కలేదు..ఫలితమే రాముడి చేతిలో రావణ సంహారం...


Also Read: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...