Ayodhya Ram Mandir Pran Pratishtha : రాముడిని అడవులకు పంపించాలని, తన కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైకేయి దశరథుడిని కోరుతుంది. గతంలో వరం ఇస్తానని మాటిచ్చిన దశరథుడు కైకేయి మాట కాదనలేకపోతాడు. కైకేయి మాట మేరకు రాముడు అడవులకు బయలుదేరివెళ్లేముందు దశరథుడి దగ్గరకు వెళతాడు..
రాముడు - మహారాజా, నేను దండకారణ్యానికి వెళుతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి
దశరథుడు - నాయనా, రామా! కైకేయి వరం అనే పాశం తో నన్ను కట్టిపడేసింది. ఏ పితృ వాక్య పరిపాలనకి నిలబడి నీవు వనవసానికి వెళుతున్నావో.. అదే తండ్రిగా నేను చెప్తున్నాను. నేను కత్తితో నీపైకి లేస్తాను. నీవు అస్త్ర శస్త్ర విద్యా పరాక్రముడివి. నీముందు నేను పడిపోతాను. రాజ్యం వశం చేసుకో. నన్ను చెరసాలలో బంధించు. నేను ఆ చెరసాల ఊచలలోంచి నిన్ను చూస్తూ బ్రతికేస్తాను.
రాముడు - మహారాజా ఆడిన మాటని తప్పి మీరు అసత్యదోషం కట్టుకోకండి. అడవికి వెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు. సెలవు ఇవ్వండి అని చెప్పి అడవులకు బయలుదేరుతాడు...
Also Read: ఈ రాశివారికి ధైర్యం, పట్టుదల రెండూ ఎక్కువే - జనవరి 20 రాశిఫలాలు
ఆ సమయంలో భరతుడు రాజ్యంలో ఉండడు..తన మేనమామ ఇంట్లో ఉంటాడు. ఆ మర్నాడు ఇంటికి చేరుకున్న భరతుడి ముందు పట్టాభిషేకం ప్రతిపాదన ఉంచుతారు. అసలు విషయం తెలుసుకున్న భరతుడు..తనని రాజుగా చేయాలన్న ప్రతిపాదనను నిరాకరించి..అన్నగారిని తీసుకొచ్చేందుకు తాను కూడా బయలుదేరుతాడు. అప్పటికి కానీ తాను చేసిన తప్పేంటో కైకేయికి బోధపడదు. భరతుడి వెంట కైకేయి, వశిష్ఠుడు, మంత్రులు, సైన్యం కూడా వెళతారు. రాముడిని కలవాలనే ఆతృతతో భరతుడు మిగిలిన వారికంటే వేగంగా అడవికి వెళ్లాడు. అన్నగారిని చూడగానే పాదాలకు గౌరవంగా నమస్కరిస్తాడు. దశరథుడి మరణవార్త భరతుడి ద్వారా విన్న సీతారామలక్ష్మణులు బాధపడతారు. ఋషులతోపాటు సోదరులతో కలిసి రాముడు గంగానదిలో తండ్రికి తర్పణం వదులుతాడు.
రాముడిని రమ్మని కోరిన భరతుడు
మరుసటి రోజు, ప్రభాత ప్రార్థన తర్వాత భరతుడు, “సోదరా! నీ వనవాసానికి నా తల్లి కారణం. ఆమె స్వార్థపూరిత ప్రవర్తనకు నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. మన తండ్రి దశరథుడు కూడా భార్యకు ఇచ్చిన వరాల కారణంగా నిన్ను వనవాసానికి పంపించాల్సి వచ్చింది. దయచేసి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకానికి అంగీకరించమని రాముడిని వేడుకున్నాడు.
Also Read: విగ్రహం కళ్లకు గంతలు ఎందుకు - ఓ రాయి దేవుడిగా ఎలా మారుతుంది!
తండ్రిని మోసం చేయలేను
రాముడు..‘‘భరతా..! మన తండ్రి భార్య ప్రేమలో పడి స్పృహ కోల్పోయే గుడ్డివాడు కాదు. సత్యానికి భయపడి నన్ను అడవికి పంపాడు. సత్యానికి మించిన భయం లేదు. తండ్రి నీకు రాజ్యాన్ని, నాకు అరణ్యాన్ని ఇచ్చారు. ఆయన మరణం తర్వాత నేను సింహాసనం అధిష్టిస్తే ఆయన మాట జవదాటినట్టే. అందుకే నేను అయోధ్యకు తిరిగిరాలేను
కైకేయి క్షమాపణ
కైకేయి రాముని వద్దకు వచ్చి, “రామా, నన్ను క్షమించు. నేను స్వార్థంతో నిన్ను అరణ్యవాసానికి పంపాను. ఇప్పుడు నేను నా తప్పును గ్రహించాను, దయచేసి అయోధ్యకు తిరిగి వచ్చి మీ తండ్రిలా రాజ్యాన్ని పాలించు" అంటుంది. అందుకు సమాధానంగా రాముడు..‘‘అమ్మా, నీ పట్ల నాకు ఎలాంటి అగౌరవం, రాజ్యంపై ఆశ లేదు. నేను 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత మాత్రమే అయోధ్యకు తిరిగి వస్తాను. భరతుడికి గానీ, నాకు గానీ రాజ్యం పట్ల ఆసక్తి లేదు. మేమిద్దరం మా తండ్రి మాటకు కట్టుబడి ఉన్నామని" చెప్పాడు.
Also Read: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి? సనాతన ధర్మంలో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు?
పాదుకలు తీసుకెళ్లిన భరతుడు
రాముడి మాటలు విని భరతుడు చాలా నిరుత్సాహపడి, “సోదరా, నువ్వు లేకుండా నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నేనూ ఇక మీదట మీతో పాటు అడవిలో ఉంటాను. లేకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తాను అని" పట్టుబట్టాడు. భరతుడిని అయోధ్యకు వెళ్లేందుకు ఒప్పించమని రాముడు వశిష్ఠుడిని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు భరతునితో ఇలా అంటాడు.. “దయచేసి నీ సోదరుడు రాముని మాట విను. అయోధ్యకు తిరిగి వచ్చి తన ప్రతినిధిగా రాజ్యాన్ని పాలించు. అలా చేయడం వల్ల నువ్వుగానీ, నీ అన్నగానీ ధర్మం తప్పినట్టు కాదు". ఆ మాటలకు అంగీకరించిన భరతుడు..రాముని సేవకునిగా రాజ్యాన్ని పాలించాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరులు రామ, లక్ష్మణుల తరహా లోనే భరతుడు కూడా నార వస్త్రాలను ధరించాలని నిర్ణయించుకుని.. రాముని పాదుకలను తలపై మోస్తూ అయోధ్యకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి రాముడు వనవాసం పూర్తిచేసుకుని తిరిగి వచ్చేవరకూ ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి చిత్తశుద్ధితో పాలించాడు.
Also Read: రామ రావణ యుద్ధంలో రాముడి రథ సారధి ఎవరు - రామాయణం గురించి ఈ విషయాలు తెలుసా!
పితృవాక్య పరిపాలకుడు అని తండ్రి ఏది చెప్తే అది యధాతధంగా చేసావాడు రాముడు కాదు. ధర్మాధర్మాలను ఆలోచించి తండ్రిని సత్య ధర్మంnముందు ఠీవీగా నిలబెట్టినవాడు రాముడు. అందుకే యుగయుగాలకు శ్రీ రాముడు ఆదర్శనీయడు అయ్యాడు