Parshuram Jayanti 2023:  ఏప్రిల్ 23 అక్షయ తృతీయ రోజు పరుశరాముడి జయంతి. పరశురాముడు..శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరో అవతారం. వైశాఖ శుద్ద తదియ రోజు పరశురాముడు జన్మించాడని స్కాంద, బ్రహ్మండ పురాణాలు చెబుతున్నాయి. క్షత్రియుల నుంచి ప్రజలను రక్షించేందుకు పరశురాముడు అవతరించాడని చెబుతారు.


పరశురామ అంటే పార్షుతో రాముడు.. అంటే గొడ్డలి. క్రూరత్వం నుంచి భూమిని కాపాడటానికి పరశురాముడు అవతరించాడు. ఆయన శివ భక్తుడు. ఆయన ఆయుధం గొడ్డలి. పరశురాముడు ప్రసేనజిత్ కుమార్తె రేణుక, బ్రిగు రాజవంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదవ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీ అవతారమైన ధనవిని పెళ్లిచేసుకున్నాడు.  హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు చిరంజీవి.  ఆయన ఇప్పటికీ జీవించిఉన్నట్టు విశ్వశిస్తారు.  భీష్ముడు, ద్రోణాచార్యులు, కర్ణుడు...వీరి ముగ్గురి  గురువు పరశురాముడు. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు . 


Also Read: సింహాచలంలో చందనోత్సవం ఎలా జరుగుతుందో తెలుసా!


హరి వంశ పురాణం ప్రకారం
హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు శాపం వల్ల చేతులు లేకుండా జన్మించాడు. కఠినమైన తపస్సు ఆచరించి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకొని  వేయి చేతులు పొంది మహావీరుడిగా నిలిచాడు. ఓ సందర్భంలో వేటకు వెళ్లి అలసిన కార్తవీర్యార్జునుడిని, పరివారాన్ని ఆదిరించి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతాడు జమదగ్ని మహర్షి.  ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి ఎలా సాధ్యమైందని అడుగుతాడు. తన దగ్గర కామధేనువు వల్లనే ఇది సాధ్యపడిందని చెబుతాడు జమదగ్ని మహర్షి. అ గోవును ఇమ్మని అడిగితే జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి  వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు పరుశరాముడు.


Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!


క్షత్రియ జాతిపై పరుశరాముడి ఆగ్రహం
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి తీసుకెళ్లిపోతారు.  పరశురాముని తల్లి రేణుక... శవంపై పడి రోదిస్తూ గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి వెళ్లి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు. అప్పటి నుంచీ క్షత్రియ జాతిపై ఆగ్రహించిన పరుశరాముడు 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను  నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. ఆ తర్వాత  పరశురాముడు భూమినంతటినీ కశ్యపుడికి దానమిచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. 


రామాయణంలో పరశురాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరిచిన తర్వాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధన, రాముడి  శాంత వచనాలనూ పట్టించుకోలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రాముడికిచ్చాడు పరుశరాముడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టడంతో  సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహిస్తాడు పరుశురాముడు. రాముడు ఎక్కుపెట్టిన బాణాన్ని వేయమని చెప్పి అది పడిన మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు. 


మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్ముడికి అస్త్రవిద్యలు బోధించాడు. ద్రోణుడు, కర్ణుడికి విద్యలు నేర్పింది పరశురాముడే. కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తర్వాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు.


పరశురామ గాయత్రి మంత్రం
ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి
 తన్నో పరశురామః ప్రచోదయాత్ ॥