నమస్తే శారదాదేవి కాశ్మీర పుర వాసిని

త్వం హమ్ ప్రార్థేయే నిత్యం

విద్యాదానం చే దేహీ మాహీ 

ఒకప్పుడు అది పండితుల నెలవు. విజ్ఞన ఖని.  అక్కడ కొలువై ఉన్న అమ్మవారి పేరుతో ఏకంగా ఒక భాషా లిపి చలామణిలో ఉండేదట. ప్రపంచ పండితుల వేదికగా, హిందూ, భౌద్ధ ధర్మాల వైభవానికి ప్రతీకగా భాసిల్లేది. 


స్థలం ఏమి చెబుతోంది?


కాశ్మీరేతు సరస్వతి అని దేవీ అష్టాదశ శక్తి పీఠ స్త్రోత్రంలో కూడా ప్రస్థావన ఉంటుంది.  దక్షయజ్ఞం తర్వాత దాక్షాయణీ అనేక భాగాలుగా భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించిందని ప్రతీతి. అవే శక్తి పీఠాలుగా వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి కుడి చేయి  పడిన కాశ్మీరం శారదాదేవికి నెలవుగా మారింది. ఇదే అష్టాదశ శక్తి పీఠాలలో చివరి శక్తి పీఠం శ్రీ సరస్వతీ శక్తి పీఠం. శాండిల్య మహర్షి ఈ పరిసరాల్లో ఉన్న శారదా వనంలో సాధన చేసుకునే వారు  అతడి తపస్సుకు శారదామాత ప్రత్యక్షమై జ్ఞానాన్ని ప్రసాదించిందని స్థల పురాణం చెబుతోంది. ఆది శంకారాచార్యుడు కూడా ఇక్కడ జరిగిన పండిత సభలోనే తన జ్ఞానాన్ని నిరూపించుకున్నారట.


ఎక్కడ ఈ అమ్మవారు?


 కాశ్మీర్ లోని శారద, నారధీ అనే రెండు పర్వతాల మధ్య నీలం నది . ఈ నది ఒడ్డునే ఉన్న శారద అనే గ్రామంలో శారదాదేవి కొలువు ఉంది. నీలం నదికే కిషన్ గంగా అని ఇంకొక పేరు ఉంది. నిజానికి ఒక కుగ్రామం కానీ అమ్మవారు కొలువై ఉండడం వల్ల ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. స్థానికులు ఈ తల్లిని గీర్ భవాని గా ఆరాధిస్తారు. ఈ పీఠాన్ని సర్వజ్ఞఫీఠం అంటారు. వాదంలో అన్ని మతాల వారిని ఓడించి ఆది శంకరాచార్యులు ఈ పీఠాన్ని స్వాధీనం చేసుకున్నారట. ఇంత ప్రాశస్త్యం కలిగిన శారద కొలువై ఉన్నందున కాశ్మీర్ ను శారదాదేశం అని పిలిచే వారట. ఇక్కడి అమ్మవారి దర్శనానికి ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది  యాత్రికులు సందర్శించారనడానికి ఆనవాళ్లు ఉన్నాయి. ప్రఖ్యాత చైనా యాత్రికుడు హుయాంగ్ సాంగ్ కూడా తన పుస్తకంలో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించాడు. అల్బరేని అనే మరో విదేశీయుడు ఈ శారదా ఫీఠాన్ని గురించి, దేవి వైభవాన్ని గురించి గొప్పగా రాసుకున్నాడు.  


అక్బర్ చక్రవర్తి ఆస్థాన పండితుడు అబుఫజల్ ఈ దేవలయాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఈ ప్రదేశం పసిడి కాంతులతో శోభాయమానంగా ఉంటుందని, ప్రతి శుక్ల పక్ష అష్టమి నాడు ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని చెప్పుకొచ్చాడు. అమ్మవారి చెంత వేదాలు అధ్యయనం చెయ్యాలన్న అభిలాషతో చాలా మంది ఇక్కడకు వచ్చే వారట. అందుకోసం ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉండేదట. ప్రధానంగా సంస్కృతం నేర్చుకునేందుకు ఎంతోమంది వచ్చే వారట. మనదేశంలోని అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో ఇది ముఖ్యమైంది. అన్ని ఆసియా దేశాల నుంచి  దాదాపుగా 5 వేల మంది విద్యార్థులు వేద అధ్యయనం కోసం గురుకులంలో ఉండేవారట.  అతి పెద్ద గ్రంథాలయం వీరికి ఇక్కడ అందుబాటులో ఉండేది. 12 శతాబ్ధం వరకు కూడా ఇది అతిపెద్ద అధ్యయన కేంద్రం.


ఏమైందీ ఈ వైభవం


కాశ్మీర్ లోని  ఈ శక్తి పీఠం ఎన్నో ఒత్తిడులకు గురైంది. ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు, మత పరమైన దాడులు, విదేశీ దండయాత్రల ఫలితంగా ఆలయం క్రమంగా శిథిలం అయిపోయింది. ఈ సమయంలోనే ఆదిశంకరులు ఇక్కడి దేవి శక్తిని ఒక బంగారు శారదా దేవి విగ్రహంలో నిక్షిప్తం చేసి దాన్ని శృంగేరీ తరలించారనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. 14 వ శతాబ్ధంలో మొదటి సారి విదేశీ దాడుల వల్ల శిథిలం అయ్యింది. ఆతర్వాత 19 శతాబ్ధంలో కాశ్మీర్ మహారాజు గులాబ్ సింగ్ మరమ్మత్తులు చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. తరువాత జరిగిన వరుస దాడులు, యుద్ధాలన్నిటికి సాక్షీ భూతం ఈ శిథిలాలయం. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. 2005 లో భూకంపం దాటికి గుడి ఆనవాల్ల చాలా వరకు కనుమరుగయ్యాయి.  అమ్మవారి విగ్రహం ఎప్పుడో అదృశ్యమైంది. ఇప్పుడు అక్కడ శివలింగాన్ని తలపించే ఒక ఆరడుగుల రాయి మాత్రమే అక్కడ కనిపిస్తుంది.


ప్రస్తుతం కాశ్మీర్ ప్రభుత్వం భారత దేశం నుంచి హిందువులు ఈ ప్రదేశాన్ని చూసేందుకు అనుమతి ఇస్తోంది. 1947-48 పాకీస్తాన్ ఇండియా యుధ్ధానంతరం ఈ ప్రాంతం ఎల్ ఓ సి కి అతి దగ్గరగా ఉన్న ప్రాంతంగా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మారిపోయింది. అప్పటి నుంచి ఆలనా పాలనా లేక  పెద్దగా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.  


వెళ్లే వీలుందా?


ఈ ఆలయం సముద్ర మట్టానికి 1981 మీటర్ల ఎత్తులో పీఓకే లోని మౌంట్ హర్ముఖ్ లోయలో ఉంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్ నుంచి 150 కీలోమీటర్ల దూరం. ఇక్కడికి చేరుకోవడానికి ముఖ్యంగా రెండు మార్గాలు ఉన్నాయి. ఉరి - ముజఫరాబాద్ మీదుగా ఒకటి , పూంచ్ - రావల్ కోట్ మీదుగా మరోటి. ఉరి - ముజఫరాబాద్ దారి ఎక్కువ మంది వెళ్లే దారి. ఉరి నుంచి సుమారు 70 కి.మీ ప్రయాణం.