Praja Sangrama Yatra: నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా గ్రామంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే అక్కడ నెలకొన్న పలు సమస్యల గురించి పాఠశాల ఉపాధ్యాయులు బండి సంజయ్ కు వివరించారు. చిన్నారి విద్యార్థులను మీరేమీ అవుదాం అనుకుంటున్నారు అని అడగ్గా... ఒకరు కలెక్టర్, మరొకరు డాక్టర్ అవుతానని చెప్పారు. చిన్నారుల సమాధానం విన్న బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల కొరతపై ఆరా తీశారు. ప్రైవేటు స్కూల్లకు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో... కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 






శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్ లను కట్టడంలోనూ కేసీఆర్ సర్కార్ విఫలం అంయిందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక, పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 'సీపీఎస్' రద్దు కి సంబంధించి పాఠశాల ఉపాధ్యాయులు బండి సంజయ్ కి వినతి పత్రం అందించారు. లింబా (బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం లింబా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భైంసాలో బహిరంగ సభను విజయవంతం చేసుకున్నామని, ఆ సభకు ప్రజలు ఏ సంఖ్యలో తరలివచ్చారో మీరు కూడా చూశారన్నారు. కాలాలకతీతంగా సంవత్సర కాలంగా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేదోళ్ల రాజ్యం కోసమే అని తెలిపారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు బయటికి వస్తారని అన్నారు. 


లింబా(బి) గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ముంపు గ్రామ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదని విమర్శించారు. వాళ్లకు కొద్దోగొప్పో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పట్టుకుంటే పడిపోయేటట్టు ఉన్నాయని ఆరోపించారు. సొంత జాగా ఉన్న వాళ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి... ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని మాట తప్పారని అన్నారు. కేసీఆర్ అంటే... ఖాసీం చంద్రశేఖర్ రజ్వి అని అన్ారు. తెలంగాణలో రజాకారుల పాలనను కేసీఆర్ చూపిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ... జైళ్ళలో పెట్టిస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు పెట్టే టెన్షన్ కు... ప్రస్తుతం కేసీఆర్ ఫుల్ బాటిల్ ఎత్తుతుండుంటూ ఎద్దేవా చేశారు. 


ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయా?


నీళ్లు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు, ఉద్యోగాలు లేవని అన్నారు. 79 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండడం ఏంటన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అననారు. సీఎం కేసీఆర్ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడని, పుట్టబోయే బిడ్డ నెత్తిపై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పెళ్లి చేసుకుందామన్న భయపడే పరిస్థితిలు ఉన్నాయన్నారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడితేనే... మీకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓబీసీ ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అన్ని స్కామ్లలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే అని కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. 






పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న బండి సంజయ్ కు... ప్రజలు ఘన స్వాగతం పులుకున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓల గ్రామంలోకి బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించింది. రైతన్నలు తీసుకొచ్చిన ఎడ్ల బండిని ఎక్కి.. కాసేపు నడిపారు. అనంతరం పాదయాత్రగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.