Srisailam Shardiya Navratri 2025: శ్రీశైలంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ భ్రమరాంబిక నవదుర్గల అలంకారంలో కనిపిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా , నాలుగో రోజు కూష్మాండ దుర్గగా అభయం ఇచ్చిన అమ్మవారు ఐదో రోజు స్కందమాతగా దర్శనమిస్తోంది.
బాల స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది.స్కందుడు శివగణాలకు సైన్యాధిపతి, జ్ఞానానికి అధిపతి. అమ్మవారు చల్లని చూపులతో ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి. అందుకే స్కందమాతని పూజిస్తే ఇద్దరి ఆశీస్సులూ లభిస్తాయని నమ్మకం. ‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’
శత్రువులను శోషింపచేయువాడు కనుకే స్కందుడు అనే పేరు. ఈయననే కార్తికేయుడు, సుబ్రహ్మణ్యస్వామి, కుమారస్వామి అని పిలుస్తారు. స్కందుడికి తల్లి కాబట్టి ఆవిడ స్కంద మాత అయింది. నవదుర్గల్లో ఇది ఐదో రూపం
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాశుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥
స్కందమాత వాహనం సింహం..తెల్లని రంగుతో ప్రకాశిస్తుంది అమ్మవారు. నాలుగు చేతులు కలిగి ఓ చేతిలో బాల స్కందుడు, మరో రెండు చేతుల్లో పద్మాలు, నాలుగో చేతితో అభయం ఇస్తూ కనిపిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా స్కందమాతను పూజించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారిని పూజిస్తే కుమారస్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది. కుమారస్వామి జననం
దక్షప్రజాపతి కుమార్తె అయన సతీదేవి..తండ్రి తలపెట్టిన యాగానికి పిలుపు రాకున్నా వెళుతుంది. అక్కడ అవమానం ఎదుర్కొని యాగాగ్నిలో ఆహుతి అవుతుంది. సతీ వియోగం కారణంగా ఆగ్రహంతో ఊగిపోయిన పరమేశ్వరుడు వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీ వియోగంలో ఉన్న శివుడు ఇక పెళ్లి చేసుకోడని తెలిసి..తారకాసురుడు తనకు శివుడి సంతానం తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణం ఉండకూడదనే వరం కోరుకుంటాడు. ఆ గర్వంతో లోకాలను పీడిస్తుంటాడు. అప్పుడు సతీదేవి హిమవంతుడి కుమార్తె శైలపుత్రిగా జన్మించి..బ్రహ్మచారిణిగా తపస్సు ఆచరించి..చంద్రఘంటగా శివుడిని వివాహం చేసుకుని కాత్యాయనిగా అనుగ్రహిస్తుంది.
స్కందమాత ఎలా అయింది?
వివాహం తర్వాత శివపార్వతులు కైలాసంలో ఉన్న సమయంలో..దేవతలంతా వెళ్లి తారకాసురుడి నుంచి రక్షించమని వేడుకుంచారు. ఆ సమయంలో దేవతల తొందరపాటువల్ల శివుడి తేజస్సు పార్వతిలో కాకుండా కిందకు జారుతుంది. ఆ తేజస్సుని కొంత అగ్ని భరిస్తాడు.. తట్టుకోలేక గంగలో వదిలేస్తాడు. గంగ భరించలేక భూమిపై రెల్లు పొదల్లో విడిచిపెడుతుంది. ఆ తేజస్సు నుంచి బాలుడు జన్మిస్తాడు. ఆరుగులు కృత్తికలు పెంచడం వల్ల తల్లుల దగ్గర పాలుతాగేందుకు ఆరు ముఖాలతో షణ్ముఖుడు అయ్యాడు. కృత్తికలు పెంచడంతో కార్తికేయుడు, శివతేజస్సుతో జన్మించినవాడు కావడంతో స్కందుడు అయ్యాడు. ఈ స్కందుడిని సేనానిగా చేసుకుని మహాసేన సహాయంతో తారకాసురుడి సంహారం చేశాడు శివుడు. ఆ సమయంలో తనయుడికి ఆయుధాన్ని అనుగ్రహించించి స్కందమాత. అందుకే ఈ అలంకారంలో అమ్మను దర్శించుకుంటే విశేష ఫలాలు లభిస్తాయి.
స్కందమాతను కేవలం శరన్నవరాత్రుల్లోనే కాదు ఎప్పుడైనా కొలుచుకోవచ్చు.
‘ఓం దేవీ స్కందమాతాయై నమః’ అనే మంత్రంతో కానీ
"సింహాసనగతా నిత్యం పద్మాంచిత కరద్వయా।
శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ"
అనే శ్లోకంతో కానీ ధ్యానించాలి.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి