Narasimha Jayanti and Jyeshtha Purnima: సింహాద్రి అప్పన్న ఆలయంలో వరుస ఉత్సవాల సందడి మొదలవుతోంది. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల్లో మార్పులు చేశారు అధికారులు
సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నారసింహుడి ఆలయంలో జూన్ 05 గురువారం నుంచి వరుస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అప్పన్న దర్శన వేళలు, ఆర్జి సేవల్లో మార్పులు చేసినట్టు ప్రకటించారు ఈవో త్రినాథరావు.
జూన్ 05 గురువారం రాత్రి నుంచి జూన్ 09 వరకూ నమ్మాళ్వార్ తిరునక్షత్రం పూజలు జరగనున్నాయి. ఈ మేరకు రాత్రి ఏడుగంటల తర్వాత భక్తులను దర్శనాలకు అనుమతించరు. రాత్రివేళ మంజూరు చేసే ఆరాధన టికెట్లు కూడా రద్దు చేశారు.
జూన్ 10 నృసింహ జయంతి సందర్భంగా ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి విశేష పూజలు, నృసింహ హోమం నిర్వహిస్తారు. కృష్ణాపురం గోశాలలో నృసింహ స్వామి విగ్రహం వద్ద సాయంత్రం 4గంటల నుంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి దర్శనం భక్తులకు లభించదు
జూన్ 11 జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, ఆరాధనలు నిర్వహిస్తారు. ఈరోజు జరిగే ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో ప్రకటించారు
నృసింహ జయంతి (Narasimha Jayanti 2025)
పురాణాల ప్రకారం..తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు, దుష్టుడైన హిరణ్యకశిపుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు నారసింహుడి అవతారంలో దర్శనమిచ్చాడు. పగలు రాత్రికి మధ్య సంధ్యాసమయంలో, మనిషి జంతువు కలగలసిన రూపంలో, భూమి ఆకాశం మీద కాకుండా ద్వారంపై కూర్చుని రాక్షస సంహారం చేశాడు. స్వామివారు ప్రహ్లాదుడిని అనుగ్రహించిన ఈ రోజునే నృసింహ జయంతి జరుపుకుంటారు. సింహాచలం కొండపై కొలువైన నారసింహుడికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు
చందనోత్సవం ( Jyeshtha Purnima 2025)
ఏటా వైశాఖమాసం శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు అక్షయ తృతీయ జరుపుకుంటాం. ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పిస్తారు. భక్తులకు నిజరూపం దర్శనం కల్పించిన అనంతరం మూడు మణుగుల చందనాన్ని స్వామివారికి లేపనంగా పూస్తారు. 3 మణుగులు అంటే 120 కిలోల చందనాన్ని లేపనంగా పూస్తారు. మొత్తం 12 మణుగుల చందనం స్వామివారికి పూస్తారు. ఇదంతా ఒకేసారి కాకుండా మూడు మూడు మణుగుల చొప్పున నాలుగు సందర్భాల్లో లేపనంగా పూస్తారు. అక్షయతృతీయ రోజు మొదటగా లేపనం పూసి..ఆ తర్వాత మళ్లీ జ్యేష్ఠపౌర్ణమి రోజు మరో మూడు మణుగుల చందనం సమర్పిస్తారు. ఈ తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మరోసారి చందనం సమర్పిస్తారు. జగనాన్నేలే స్వామి చల్లగా ఉంటే జగమంతా చల్లగా ఉంటుందని భక్తుల నమ్మకం.
నమో నారసింహ
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!