Ujjains Nagchandreshwar Temple: ఆగష్టు 08 నాగులచవితి, ఆగష్టు 09 గరుడ పంచమి... కొన్ని ప్రాంతాల్లో కార్తీకశుద్ధ చవితి రోజు పుట్టలో పాలు పోస్తే..మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చవితి రోజు పాములను పూజిస్తారు. అయితే పుట్ట దగ్గర పూజల సంగతి సరే కానీ.. ఓ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవాలంటే కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం అవుతుంది..అదికూడా శ్రావణ శుద్ధ పంచమి రోజు మాత్రమే.
Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!
సర్పరాజు తక్షకుడు ఉండే రోజు
భారత దేశంలో పాములను ఆరాధించే సంప్రదాయం యుగయుగాలుగా ఉంది. అనారోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహానికి ఎదురైన ఆటంకాలతో పాటూ జాతకంలో ఉండే దోషాలు సర్పపూజ చేస్తే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మన దేశంలో నాగపూజ జరిగే ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది నాగచంద్రేశ్వర దేవాలయం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అత్యంత పురాతననగరం అయిన ఉజ్జయినిలో ఈ ఆలయం ఉంది. సాధారణంగా ఉజ్జయినీ అనగానే మహాకాళేశ్వర లింగం గుర్తుకు వస్తుంది. భారత దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మహాకాళేశ్వర లింగం. ఈ దేవాలయం మూడో అంతస్తులోనే నాగ చంద్రేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ కేవలం నాగపంచమి రోజున మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమి రోజు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకపూజలు చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు సర్పరాజు తక్షకుడు ఇక్కడ ఉంటాడని భక్తుల విశ్వాసం.
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!
సర్పంపై శయనించే శివుడు
నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11 వ శతాబ్దానికి చెందిన ప్రతిమ ఉంటుంది...ఇందులో పడగ విప్పి ఉండే పాముని ఆసనంగా చేసుకుని శివపార్వతులు దర్శనమిస్తారు. ఇది నేపాల్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించారని చెబుతారు..అందుకే ఉజ్జయినిలో మినహా మరెక్కడా ఇలాంటి ప్రతిమ కనిపించదు. సాధారణంగా శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు..కానీ ఉజ్జయిని క్షేత్రంలో ఉన్న నాగచంద్రేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు శయనించి కనిపిస్తాడు. ఇక్కడ శివపార్వతులతో పాటూ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. సర్పంపై శివుడు పవళించి ఉండడంపై ఓ కథనం ప్రచారంలో ఉంది. సర్పరాజు తక్షకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు. ఆ తపస్సుకి మెచ్చి ప్రసన్నమైన శివుడు తక్షకుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తూ వరమిచ్చాడు. అప్పటి నుంచి తక్షకుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడంటారు.
Also Read: పాములు కలలోకి వస్తున్నాయా, సర్పదోషం వెంటాడుతోందా...ఆగష్టు 08 నాగుల చవితి రోజు ఇలా చేయండి!
ఏడాదికి ఒక్కరోజే దర్శనం
నాగచంద్రేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది..1050లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడని ఆ తర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మహరాజ్ 1732 లో ఆలయ జీర్ణోద్ధరణ చేపట్టాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు తరతరాలుగా వెంటాడుతున్న సర్పదోషాలన్నీ తొలగిపోతాయంటారు. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఒక్కరోజే దాదాపు మూడు లక్షల మంది భక్తులు నాగచంద్రేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషం.