Bangladesh Unrest: "మిమ్మల్ని మీరు మైనార్టీలుగా ఎందుకు అనుకుంటారు..? అయినా అసలు మైనార్టీ, మెజార్టీ అంటూ ఏమీ ఉండదు. కులం, మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాం". ఇవి ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువుల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు. అన్ని మతాల వారికీ సమాన గౌరవం ఇస్తామని తేల్చిచెప్పారు. కానీ..ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్‌లో ముస్లింల జనాభాయే ఎక్కువ. అధికారికంగా హిందువులను మైనార్టీలుగా ప్రకటించకపోయినా...ఇప్పటికీ అక్కడ వాళ్లు మైనార్టీలుగానే ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయ సంక్షోభం ముదరడం వల్ల ఈ వివక్ష చాలా స్పష్టంగా కనబడుతోంది. హిందూ ఆలయాలు, ఇళ్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. హిందువులపైనా అక్కడ దాడులు జరుగుతున్నాయి. 


కొంత మంది చెబుతున్న లెక్కలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌ల ప్రకారం 1951లో బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 2.2 కోట్లు. ఇప్పుడది 1.3 కోట్లకు పడిపోయింది. కొంత మంది వాదన ఏంటంటే...ఇన్నేళ్లలో అక్కడ భారీ ఎత్తున మత మార్పిడులు జరిగాయని. ఇప్పటికీ అక్కడ ఇది కొనసాగుతోందని వాదిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా హిందూ వర్గాన్నే టార్గెట్‌గా చేసుకుని దాడులు చేసేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇస్కాన్ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అలా అని అన్ని చోట్లా ఇదే జరుగుతోందనడానికీ వీల్లేదు. ఓ హిందూ ఆలయంపై దాడి జరగకుండా ముస్లింలే అడ్డుకున్నారన్న వీడియోలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు ఎందుకీ స్థాయిలో దాడులు చేస్తున్నారన్నదే ఇప్పుడు కలవర పెడుతున్న విషయం. 


మోదీ పర్యటనతో మొదలు..


బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం (All Eyes on Bangladesh Hindus) ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆ సమయంలో చాలా మంది బంగ్లా పౌరులు ఈ పర్యటనను తీవ్రంగా నిరసించారు. పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. అప్పటి నుంచి చినికి చినికి గాలి వానగా మారిందీ విధ్వంసం. Hindu American Foundation వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ (Hindu Population in Bangladesh) నుంచి వలస వెళ్లిపోయారు. 1964-2013 మధ్య కాలంలో వీళ్లంతా తీవ్ర వివక్షకు గురయ్యారు. అందుకే బంగ్లాని వీడారు. అయితే...హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్‌ని తమ అధీనంలోకి తీసుకోడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.


ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే...బంగ్లాదేశ్‌ పౌరులు ఎప్పుడు వచ్చి సాయం కోరినా ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. అయితే...దీనిపై పొలిటికల్‌గా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేత సువేందు అదికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు కోటి మంది హిందువులు బెంగాల్‌కి వస్తున్నారని,  వాళ్లందరికీ ఆశ్రయమిచ్చేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తరవాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. 


Also Read: Bangladesh News: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు- మహమ్మద్ యూనస్‌ నేతృత్వంలో పాలన