Bobby Deol: నటీనటుల ఆహారపు అలవాట్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమాకు, పాత్రకు తగినట్టుగా మారడం కోసం వారు ఎప్పటికప్పుడు తమ అలవాట్లను మార్చుకుంటూ ఉంటారు. అలాగే తాజాగా తనకు ఒకప్పుడు ఉన్న ఆహారపు అలవాట్ల గురించి బయటపెట్టారు ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్. చిన్నప్పుడు తనకు రోజుకు 7 నుంచి 8 గ్లాసుల పాలు తాగే అలవాటు ఉండేదని చెప్పుకొచ్చారు బాబీ. రోజులు గడుస్తున్నకొద్దీ ఆ అలవాటు ఎలా మారిపోయిందో వివరించారు. అయితే అలా ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల లాభనష్టాల గురించి డాక్టర్లు స్పష్టం చేశారు.
పెద్ద గ్లాస్‌లోనే..
‘‘నేను ఒకప్పుడు చాలా పాలు తాగేవాడిని. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల పాలు తాగేవాడిని. అప్పట్లో నాకు జీర్ణ సమస్యలు ఎందుకు ఉండేవో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నేను కిచెన్‌లో ఉన్న పెద్ద గ్లాస్‌ను వెతికి తీసుకునేవాడిని. ఎందుకంటే అందులో అయితే ఎక్కువ పాలు తాగొచ్చు అని. మా నాన్న ధర్మేంద్రకు గిఫ్ట్‌గా వచ్చిన గ్లాస్ చాలా పెద్దగా ఉండేది. అది నా గ్లాస్ అని, ఎవరినీ ముట్టుకోవద్దని చెప్పేవాడిని’’ అని గుర్తుచేసుకున్నారు బాబీ డియోల్. ఒకప్పుడు తాను అంతలాగా పాలు తాగినా.. ఆ అలవాటు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఇప్పుడు కేవలం రోజుకు ఒక గ్లాస్ మాత్రమే పాలు తాగుతున్నానని అన్నారు.
పిల్లల్లో ఇలా..
ఒక ప్రముఖ న్యూట్రీషనిస్ట్ చెప్పినదాని ప్రకారం.. ‘‘రోజుకు 7 నుంచి 8 గ్లాసుల పాలు తాగడం అనేది పెద్దవారిలో ఒకలాగా, చిన్నపిల్లల్లో ఒకలాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. పిల్లల్లో ఎముకల బలం పెంచడానికి ఉపయోగపడే క్యాల్షియమ్, విటమిన్ డి, ప్రొటీన్ వంటివి పాలల్లో ఉంటాయి. కానీ పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడం, లాక్టోస్ పడకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలలోని చక్కెరను లాక్టోస్ అంటారు. ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల దీని జీర్ణం కష్టమవుతుంది. పిల్లలు ఎదురుగుతున్న క్రమంలో వారికి లాక్టోస్ పడకపోవడం మొదలవుతుంది. దానివల్ల కడుపు ఉబ్బడం, గ్యాస్, డయేరియా, క్రాంప్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి’’ అని తెలుస్తోంది.
పెద్దవారిలో అలా..
ఇక పెద్దవారు కూడా ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఉంటాయని న్యూట్రీషనిస్ట్స్ చెప్తున్నారు. ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ. పాలలోని కొవ్వు వల్ల శరీరంలోని ట్రైగ్లైసెరైడ్ లెవెల్స్ పెరిగి గుండె సమస్యలు వస్తాయి. పాలలోని క్యాలరీ కంటెంట్ వల్ల పిల్లల్లో ఒబిసిటీ, షుగర్ పేషెంట్లలో షూగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాల ఉత్పత్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ఆవులకు IGF - 1 అనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. దానివల్ల పలు రకాల క్యాన్సర్లు కూడా రావచ్చు. అందుకే పిల్లలయినా, పెద్దలయినా స్కిమ్ మిల్క్ తాగడం వల్ల ఇలాంటి సమస్యలు దూరమవుతాయని డాక్టర్లు చెప్తున్నారు.
Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్