ముఖం మీద ఉండే పుట్టుమచ్చ కొందరికి బ్యూటి స్పాట్ వలే చాలా అందంగా ఉంటుంది. ముఖంలో కొన్ని భాగాలలో కనిపించే పుట్టుమచ్చలు ప్రత్యేక అందాన్ని ఇస్తాయి కూడా. అయితే పుట్టు మచ్చలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాలు, వారి జాతకాలు కూడా తెలుసుకోవచ్చు. మన జాతకాన్ని అనుసరించే మన శరీరం మీద పుట్టుమచ్చలు ఏర్పడతాయని జ్యోతిషం చెబుతోంది. వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని కూడా పుట్టుమచ్చలు వివరిస్తాయి. పుట్టు మచ్చలు అదృష్ట, దురదృష్టాలకు సంకేతాలు. కొన్ని పుట్టమచ్చలు స్త్రీపురుషులకు ఒకే లాంటి ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని వేర్వేరు ఫలితాలను ఇస్తాయి. ముఖం మీద కుడి వైపున మచ్చలు ఉన్న పురుషులు అదృష్ట వంతులు అవుతారు. నల్లని పుట్టు మచ్చల కంటే గోధుమ రంగు, లేత ఆకుపచ్చ షేడ్ లో ఉండే పుట్టు మచ్చలు శుభసంకేతాలుగా శాస్త్రం భావిస్తుంది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణం, ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎక్కడ ఏర్పడ్డాయనే దాన్ని బట్టి పుట్టుమచ్చలకు సంబంధించిన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. శరీరంలో కొన్ని భాగాల్లో కనిపించే పుట్టు మచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయట. కొన్ని భాగాల్లో పుట్టు మచ్చలు కష్టించి పనిచేస్తే తిరుగుండదనేందుకు సంకేతాలైతే మరి కొన్ని ఆయాచిత ధనప్రాప్తికి సూచనలట.


హెయిర్ లైన్ లో


హెయిర్ లైన్ లో నల్లగా మెరిసే పుట్టుమచ్చ అందాన్ని కూడా ఇనుమడింప చేస్తుంది. హెయిర్ లైన్ లో దాగి ఉన్న పుట్టు మచ్చ పవిత్రమైందనే నమ్మకం కూడా ఉంది.


కనుబొమ్మల్లో


కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ లేదా కనుబొమ్మ చివర పుట్టుమచ్చ ఉంటే అది అదృష్టానికి సూచిక. ఈ పుట్టు వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారనేందుకు ప్రతీక. కనుబొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉంటే వారు దీర్గాయుష్షుమంతులు అవుతారు. ఈ వ్యక్తి పురుషుడైతే విపరీతమైన స్త్రీ ఆదరణ కలిగి ఉంటాడు. అదే కనుబొమ్మల మీద పుట్టు మచ్చ ఉంటే సుగణవతి అయిన భార్య దొరుకుతుంది. భార్యామూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. కంటిలోపల మచ్చ ఉన్న వాడు ఆస్తి పరుడు అవుతాడు.


చెంప మీద


చెంప మీద పుట్టుమచ్చ ఉన్న వారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయట. ఇది మీ వెంట ఉండే అందరికీ మీరు మార్గదర్శనం చేస్తారనడానికి సంకేతం. అందరి బాధ్యత తీసుకుంటానడానికి కూడా నిదర్శనం.


ముక్కుమీద


ముక్కు మీద ఉండే పుట్టు మచ్చ మీలోని అంతులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ముక్కు మీద పుట్టుమచ్చ ఉండే వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు కనుక ఒకింత పొగరుగా కూడా కనిపిస్తారు. అహంకారిగా పేరు పొందుతారు.


పెదవికి కుడి వైపు


పెదవులకు కుడి వైపు పుట్టమచ్చ ఉన్న వారు చాలా అదృష్టవంతులు. వీరికి అనుకూలమైన దాంపత్య జీవితం లభిస్తుంది. మనసెరిగిన భాగస్వామి దొరుకుతారు.


చెవి మీద


చెవి మీద లేదా చెవి  లోపల పుట్టు మచ్చ ఉండడం చాలా అదృష్టం. వీరు దీర్ఘాయుశ్మంతులుగా ఉంటారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. పెద్దగా ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారని నమ్మకం.


Also Read: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు