India-China Border:
వైట్‌హౌజ్ ప్రకటన..
భారత్ చైనా సరిహద్దు వివాదంపై మరోసారి అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. పదేపదే చైనా...భారత్‌ను కవ్వించాలని చూస్తోందని మండి పడింది. వైట్‌హౌజ్‌లోని ఓ ఉన్నతాధికారి దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతునిస్తామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిప్యుటీ అసిస్టెంట్, ఇండో పసిఫిక్ కో ఆర్డినేటర్ కర్ట్ క్యాంప్‌బెల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"అమెరికాకు భారత్ మిత్ర దేశం కాదు. భవిష్యత్‌లోనూ ఈ మైత్రి ఉండకపోవచ్చు. అలా అని మా రెండు దేశాలు కలిసి పని చేయవని అనుకోడానికి వీల్లేదు. చాలా విషయాల్లో మేం పరస్పరం సహకరించుకుంటాం. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యత ఏంటో మనం అంతా అర్థం చేసుకోవాలి. ఈ విషయం మేం అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని బలపరుచుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇప్పటికే ఇది జరుగుతోంది. ఇకపై ఇది మరింత బలంగా మారుతుంది"
- కర్ట్ క్యాంప్‌బెల్, జో బైడెన్ డిప్యుటీ అసిస్టెంట్
ఇదే సమయంలో భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించారు కర్ట్ క్యాంప్‌బెల్. ఇక్కడ వివాదం ముదిరితే..అది అమెరికాపైనే కాకుండా...ఇండియా పసిఫిక్ ప్రాంతంపైనా ప్రభావం పడే ప్రమాదముందని అగ్రరాజ్యం భావిస్తోంది. అందుకే...ఇక్కడి పరిస్థితులపై నిఘా పెట్టినట్టు చెబుతోంది.
"భారత్‌ను చైనా పదేపదే కవ్విస్తోంది. 5 వేల మైళ్లున్న సరిహద్దు ప్రాంతంలో చైనా భారత్‌ను ఎలా కవ్విస్తోందో స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇది కచ్చితంగా ఖండించాల్సిన విషయమే. భారత్‌కే కాదు. భారత్ మిత్ర దేశాలనూ ఇది ఇబ్బంది పెట్టే అంశం"
- కర్ట్ క్యాంప్‌బెల్, జో బైడెన్ డిప్యుటీ అసిస్టెంట్
అరుణాచల్‌ప్రదేశ్ భారత్‌దే..
అరుణాచల్ ప్రదేశ్ విషయమై చైనా ఎన్నో ఏళ్లుగా భారత్‌తో తగువులాడుతోంది. అరుణాచల్ తమ దేశంలో భాగమే అంటూ వాదిస్తోంది. భారత్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చాలా సార్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌కు మద్దతుగా నిలిచింది. మెక్‌మహాన్ రేఖకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ తీర్మానం కూడా పాస్ చేసింది. మెక్‌మహాన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది.
"ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా చూస్తోంది. ఇలాంటి సమయంలో వ్యూహాత్మక మైత్రి ఉన్న దేశాలతో అమెరికా మద్దతుగా నిలవాల్సిన అవసరముంది. ముఖ్యంగా భారత్‌కు తప్పకుండా అండగా ఉంటాం"
- సెనేటర్
అంతే కాదు. ఇదే తీర్మానంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని భారత్‌లో భాగమే అని తేల్చి చెప్పింది అమెరికా. ఎల్‌ఏసీ విషయంలో భారత్‌తో జరిగిన ఒప్పందాలను చైనా ఖాతరు చేయకపోవడంపై మండి పడింది. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని వెల్లడించింది. దాదాపు ఆరేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. గల్వాన్ ఘటనతో అది రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్‌ను PRCలో భాగమే అన్న చైనా వాదనను అమెరికా చాలా తీవ్రంగా ఖండిస్తోంది.
Also Read: Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్