Mosquito Coil Fire Delhi:
పరుపుపై పడి మంటలు..
ఢిల్లీలోని ఓ కుటుంబాన్ని మస్కిటో కాయిల్ మింగేసింది. శాస్త్రిపార్క్‌లోని ఓ ఇంట్లో మస్కిటో కాయిల్ పెట్టుకుని ఆరుగురు కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అది ఉన్నట్టుండి పరుపుపై పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని ఇల్లంతా వ్యాప్తి చెందాయి. ఆ మంటలకు వాళ్లకు ఊపిరాడలేదు. శ్వాస తీసుకోలేక కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలొదిలారు. ఆ కాయిల్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే శ్వాస అందక చనిపోయారని వైద్యులు వెల్లడించారు. ముందుగా ఓ దిండుకి మంటలు అంటుకున్నాయని, ఆ తరవాత పరుపూ పూర్తిగా కాలిపోయిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ, ఓ చిన్నారి ఉన్నట్టు వెల్లడించారు.
"ఉదయం 9 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాం. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో 9 మంది ఉన్నారు. ఆరుగురు మృతి చెందారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వాళ్లకు చికిత్స అందిస్తున్నాం. వాళ్లు నిద్రించే సమయంలో ఉన్నట్టుండి మస్కిటో కాయిల్ దిండుపై పడి మంటలంటుకున్నాయి. ఇల్లంతా పొగ కమ్మేసింది. అది పీల్చడం వల్ల వాళ్లంతా కోమాలోకి వెళ్లిపోయారు. శ్వాస ఆడక చనిపోయారు"
- పోలీసులు
వీళ్ల ప్రాణాలు తీసింది ఆ మస్కిటో కాయిల్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది పీల్చితే శరీరమంతా ఉన్నట్టుండి పాలిపోతుంది. శ్వాస ఆడదు. స్పృహ కోల్పోతారు. కోమాలోకి వెళ్లే అవకాశాలుంటాయి. ప్రాణాలు కోల్పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో అదే జరిగింది.