Nitin Gadkari Retirement: 



కొంత కాలంగా పుకార్లు..


కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారా..? ఎలా మొదలైందో కానీ...కొద్ది రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలూ ఆయన రిటైర్ అయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం చేశాయి. గతంలో కొన్ని సార్లు కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తరవాత...వాటిపై వివరణ ఇచ్చారు గడ్కరీ. అప్పటి నుంచి అధిష్ఠానంతో గడ్కరీకి భేదాభిప్రాయాలున్నాయన్న వదంతులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రాజకీయాలకే గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. దీనిపై స్వయంగా గడ్కరీయే క్లారిటీ ఇచ్చారు. కాస్త బాధ్యతగా నడుచుకోవాలంటూ మీడియాకు చురకలు కూడా అంటించారు. రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ముంబయి గోవా నేషనల్ హైవే నిర్మాణ పనులను సమీక్షించిన గడ్కరీ..ఆ తరవాత ఈ వ్యాఖ్యలు చేశారు. 


"రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఈ విషయంలో కాస్త మీడియా బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది"


- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి 



చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని చెప్పిన ఆయన...ఇకపైన పర్యావరణ హిత కార్యక్రమాలపై మొగ్గు చూపుతానని తెలిపారు. నీటిని ఒడిసి పట్టుకునే విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసేందుకు అవకాశముందని అన్నారు. 


"నీటి సంరక్షణ, వాతావరణ మార్పుల అంశాల్లో ఎన్నో ప్రయోగాలు చేసేందుకు ఆస్కారముంది. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నాను. ఇకపైన పర్యావరణ అంశాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రజలు నాకు ఓటు వేయకపోయినా, నన్ను ఎన్నుకోకపోయినా పెద్దగా బాధ పడను. ప్రజలు నన్ను ఎన్నుకుంటే నేనొస్తాను. లేదంటే మరో వ్యక్తి నా స్థానంలో ఉంటారు. కానీ పర్యావరణ మార్పులపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. ఈ సమస్య తీర్చేందుకు ప్రయత్నిస్తాను"


- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి 


మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు..


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ...మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.  TIOL Fiscal Heritage Award 2022 కార్యక్రమానికి హాజరైన ఆయన..కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాన్ని వ్యూహాత్మకంగా తీర్చిదిద్దటంలో మన్మోహన్ సఫలం అయ్యారని అన్నారు. సమాజంలో వెనకబడిన వర్గాలకూ ప్రాధాన్యత దక్కేలా మార్పులు చేర్పులు చేశారని కొనియాడారు. "దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ కొత్త దారిని చూపారు. ఆయనకు దేశమంతా రుణపడి ఉంటుంది" అని కితాబునిచ్చారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్..దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ సమయంలో ప్రధాని పీవీ నర్సింహరావుతో కలిసి ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు మన్మోహన్. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచటం, ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి, పబ్లిక్, ప్రైవేట్ రంగాల మధ్య దూరం తగ్గించటం లాంటి కీలక లక్ష్యాలతో అప్పట్లో ఈ సంస్కరణలు అమలు చేశారు. అవే...దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేశాయి. 1990ల్లో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తు నిధులు సమీకరించారని, ఆయన చేపట్టినసంస్కరణలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ తెచ్చిన సంస్కరణలన్నీ ఎందుకూ పనికి రాకుండా పోయాయని విమర్శిస్తే...గడ్కరీ మన్మోహన్ సింగ్‌ను పొగడటం చర్చకు దారి తీసింది. అప్పటి నుంచే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలు వినిపించాయి. 


Also Read: Amritpal Singh News: అమృత్ పాల్ పాకిస్థాన్‌కు పారిపోవడం బెటర్, లొంగిపోవడం కరెక్ట్ కాదు - శిరోమణి అకాలీ దళ్ చీఫ్