సంక్రాంతి తర్వాత దసరా పండగని సినిమాలకు బెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. దాదాపు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి, వాటిని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తుంటారు. ప్రతీ హీరో కూడా తన సినిమా అదే టైంలో థియేటర్స్ లోకి రావాలని కోరుకుంటాడు. అయితే ఈసారి విజయ దశమి కోసం టాలీవుడ్ లో తీవ్ర పోటీ నెలకొంది. కుర్ర హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ అందరూ ఫెస్టివల్ సీజన్ మీదనే కన్నేశారు. ఏడు నెలల ముందుగానే రిలీజ్ డేట్స్ ని బ్లాక్ చేసుకుంటున్నారు. దీంతో బాక్సాఫీసు వద్ద భారీ క్లాష్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో కొన్ని పాన్ ఇండియా చిత్రాలు ఉండటంతో ఇతర భాషల్లోనూ పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సినిమాలంటే ఇప్పుడు చూద్దాం!



యంగ్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. BoyapatiRAPO అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేసారు. దసరా స్పెషల్ గా 2023 అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.




అయితే రామ్ కి పోటీగా మాస్ మహారాజా రవితేజ కూడా విజయ దశమి బరిలో దిగుతున్నారు. ఆయన నటిస్తున్న 'టైగర్ నాగేశ్వర రావు' మూవీని అదే రోజున విడుదల చేయనున్నారు. 1970స్ లో పేరు మోసిన గజదొంగ టైగర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో విడుదల కాబోతోందని పేర్కొన్నారు.



రామ్ మరియు రవితేజకు ఇవి ఫస్ట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో, ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రిలీజ్ కు దసరా మంచి సీజన్ అని భావించి, డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి, మంచి కలెక్షన్స్ సాధించడానికి ఈ చిత్రానికి ఛాన్స్ ఉంటుంది. అయితే అదే సీజన్ లో ఈ రెండు చిత్రాలకు పోటీగా, తమిళ చిత్రం 'లియో'.. హిందీ 'గణపత్' సినిమాలు బాక్సాఫీసు బరిలో దిగుతున్నాయి.


కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. తమిళ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు టైగర్ ష్రాఫ్ - అమితాబ్ బచ్చన్ నటిస్తున్న 'గణపత్' పార్ట్-1 ను కూడా దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. సో ఈ రెండు చిత్రాలు తమిళ్, హిందీ భాషల్లో రామ్, రవితేజ సినిమాలకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంది.


ఇదిలా ఉంటే ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా దసరా సీజన్ లో రావాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న NBK108 చిత్రాన్ని అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయాలని ప్రాధమికంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మామూలుగా అయితే బోయపాటితో బాలయ్య సాన్నిహిత్యాన్ని బట్టి చూస్తే, వీరి చిత్రాలు ఫైట్ కు దిగే అవకాశం లేదు. కానీ దసరా పండుగకు ఎక్కువ సెలవులు ఉంటాయి కాబట్టి, సమస్య లేదని భావిస్తున్నారట. మరి త్వరలోనే డేట్ ని అనౌన్స్ చేస్తారేమో చూడాలి.


Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?