లవంగంను కింది విధాలుగా చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఎప్పుడు, ఎలా ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకుందాం.


మన సనాతన శాస్త్ర పరిజ్ఞానాల్లో జ్యోతిష్యం కీలకమైంది. ఇది జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలకు చిన్నచిన్న మార్గాల్లో కూడా పరిష్కారాలను సూచిస్తుంది. వీటిని అనుసరించి జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సూచించే పరిష్కారాలను ఏవిధంగా అనురిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సరైన మార్గంలో ఈ ఉపాయాలను పాటించకపోతే సరైన ఫలితాలను పొందలేమని పండితులు సూచిస్తున్నారు. పూర్తి నమ్మకంతో, సరైన సమయంలో, సరైన విధానంతో ఈ చిట్కాలను అనుసరించి మంచి ఫలితాలు సాధించవచ్చట.


కాలసర్ప దోషం తొలగిపోతుంది


కొంత మంది జాతకంలో కాలసర్పదోషం ఉంటుంది. జాతక చక్రంలో రాహు కేతువులు మినహా మిగతా ఏడు గ్రహాలు రాహుకేతువుల మధ్య ఉన్నట్టయితే వారి జాతకంలో కాలసర్పదోషం ఉన్నట్టే. ఈ దోషం ఉన్నపుడు ఖర్చులు అధికంగా ఉంటాయి. శత్రుబాధలు, న్యాయపరమైన సమస్యలు బాధిస్తాయి. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు, అపజయం వెంటాడుతుంది. ఇలా కాలసర్పదోషంతో బాధపడుతున్న వారు చిన్న పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయట.  శుక్ల పక్షంలోని సోమవారం రోజున శివలింగానికి రెండు లవంగాలు సమర్పించాలి. ఇలా నలభై రోజుల పాటు వరుసగా చేస్తే కాలసర్ప దోషం నుంచి ఉపశమనం దొరుకుతుంది. 40 రోజుల తర్వాత నుంచి మంచి మార్పు కనిపిస్తుంది.


అన్నింటా విజయం కోసం


కొన్ని సార్లు మన సమయం బాగా లేనపుడు ఏ పనులు మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురై ఆ పనులు పూర్తిచేయడంలో జాప్యం జరగడం, వాయిదాలు పడడం జరుగుతుంటాయి. ఆ పనులు పూర్తయితే కానీ జీవితం ముందుకు నడవని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయాల్లో నిరాశ ఆవహిస్తుంది. అలా నిరాశ చెందకుండా చిన్న చిట్కా పాటిస్తే ఫలితం ఉండవచ్చని పండితులు చెబుతున్నారు. ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నపుడు నోట్లో లవంగం ఉంచుకొని బయలుదేరాలి. అక్కడకు చేరే ముందు వాటిని బయటకు తీసెయ్యాలి. ఇలా చేస్తే తప్పనిసరిగా మంచి ప్రయోజనాలు పొందుతారు. వెళ్లిన పని విజయవంతంగా పూర్తి చేస్తారు.


ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు


ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుందో. కొంత మందికి ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా కలిసిరాదు. అలా కలసి రానపుడు జీవితం దుర్భరంగా మారుతుంది. ఏం చేస్తే ఈ కష్టాల నుంచి బయటపడతామో అర్థంకాదు. అలాంటి సమయంలో కొన్ని చిన్నచిన్న నియమాలను అనుసరించి పరిహారం చేసుకుంటే ఆర్థిక కష్టాల నుంచి బయట పడవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. శుక్రవారం నాడు గులాబి పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత 5 లవంగాలను, 5 రూపాయి బిల్లలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వాటిని మీరు డబ్బుదాచే చోట ఉంచాలి. పూర్తి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది.


Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది


గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.