Kiran Kumar Reddy resigns to Congress: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపారు. శనివారం రోజే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.  బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 


బీజేపీలో చేరనున్నారా ! 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీలోకి చేరోబుతున్నట్టు సమాచారం. 2014 నుంచి ఆయన రాజకీయ అజ్ఞాతంలో ఉన్నారు. ఎలాంటి రాజకీయా కామెంట్స్ కానీ, రాజకీయాలపై అభిప్రాయాలు కాని చెప్పడం లేదు. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పని చేసిన ఆయన విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారు. తర్వాత జరిగిన కీలక పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

 


ఎన్నికలకు ఏడాదికిపైగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అప్పుడే రాజుకుంటున్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో తెలుగుదేశం, వైసీపీ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా ఎత్తుగడలు వేస్తోంది. ప్రజల్లో ఉండేలా కార్నర్ మీటింగ్స్, ప్రజాసమస్యలపై పోరాటాల పేరుతో ఆ పార్టీ నేతలు చేస్తున్న పోరాటాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు. అయినా అందుకు సరిపడా బలం మాత్రం కనిపించడం లేదు. అందుకే ఏపీలో బలోపేతం అయ్యేలా పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించేలా వ్యూహాలను బీజేపీ రచిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చోకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన కూడా దీనికి అంగీకరించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన ఎదురు తిరగడం అప్పట్లో పెను సంచలనమైంది. సమైక్యవాదానికి అనుకూలంగా ప్రెస్‌మీట్‌లు పెట్టిమారీ విభజనకతో కలిగే నష్టాలు వివరించారు. దీంతో ప్రభుత్వమే రెండు వర్గాలుగా చీలిపోయింది. అయినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. సీఎంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పిన మాటలను అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని విభజించేసింది. దీంతో కిరణ్ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేసి సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టారు. చెప్పు గుర్తుపై పోటీ చేసి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. 


మూడు రాజధానులపై కిరణ్ ఏమన్నారంటే.. 
అన్ స్టాపబుల్ 2 లో పాల్గొన్న సందర్భంగా మూడు రాజధానులపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. అసెంబ్లీ జరిగేటప్పుడు అధికారులంతా అక్కడే ఉండాలన్నారు. ఎగ్జిక్యూటివ్‌ అంటే కేబినెట్‌, సెక్రటేరియట్‌కు సంబంధించిన అధికారులు అసెంబ్లీకి హాజరవ్వాలన్నారు. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను సీఎం,  మంత్రుల దగ్గర చర్చించి, వారి సూచనతో కోర్టులో ఏం చెప్పాలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీ, కోర్టు, సచివాలయం మూడూ కలిసి ఉంటేనే పాలనా సౌలభ్యం ఉంటుందని అన్నారు.


ఆ తర్వాత రాష్ట్ర విభజనను చూడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. నా తండ్రి పోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంతే బాధపడ్డానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన పనిలేదన్నారు. మూడు రాజధానుల అంశంపైనా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అన్నీ ఒక్క చోట ఉంటేనే పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు.