Medaram Jatara 2024:  శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం మొక్కులు ఇలా.. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.  అతిపెద్ద గిరిజన జాతరగా, రాష్ట్ర పండగగా ఖ్యాతి గడించిన ఈ జాతర రెండేళ్లకోసారి కన్నుల పండువగా జరుగుతుంది. ఈ జాతరలో అడుగడుగూ అద్భుతమే


నాగుపాము రూపంలో పగిడిద్దరాజు


సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు. సమ్మక్క, సారలమ్మ దర్శనానికి ఎంతమంది వస్తారో చూస్తుంటాడట.  


Also Read: నిరాడంబరంగా ఉండే సమ్మక్క సారలమ్మ ల గద్దెలు కాలక్రమేణా ఇలా మారాయ్!


తేనెటీగలు కాపలా


కుంకుమభరిణె ఉండే ప్రాంతం అయిన చిలుకలగుట్టను అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. ఈ గుట్ట చుట్టూ తేనెటీగలు కాపలా ఉంటాయి. ఆ ప్రదేశంలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే తేనెటీగలు వెంటబడి తరుముతాయని ఆదివాసీల విశ్వాసం. 


ఈ నీరు తాగితే సమస్త రోగాలు మాయం


చిలుకలగుట్టపై నుంచి రెండు సన్నని జలధారలు నిరంతరాయంగా ప్రవహిస్తుంటాయి. వీటిని సమ్మక్క, సారలమ్మ జలధారలుగా చెబుతారు. ఈ నీటిని తాగితే రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.


పూజారుల చేతిలో కాంతిరేఖ


సమ్మక్కను తీసుకు రావడానికి ఒకరోజు ముందు చిలుకలగుట్టపైకి వెళ్లే పూజారుల చేతుల్లో ఓ కాంతిరేఖ వచ్చిపడుతుందని అదే సమ్మక్క ప్రతిరూపంగా పూజారులు చెబుతారు. 


Also Read: అడవి తల్లుల దీవెనెకు ప్రతిరూపం - భక్తజన వనసంబురం మేడారం గురించి ఈ విషయాలు తెలుసా!


మూడో రోజు అత్యంత ప్రధానం


జాతరలో అత్యంత ముఖ్యమైనది మూడోరోజే. ఆ ఒక్క రోజే దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు.. మొక్కుబడులు, ఎదురుకోళ్లు, పొర్లుదండాలు, జంతుబలులు, శివసత్తుల పూనకాలతో ఆ ప్రదేశం మొత్తం హోరెత్తిపోతుంది. తమ కష్టనష్టాలు తీర్చి సుఖసంతోషాలు ప్రసాదించాలంటూ వనదేవతలను తమ శక్తి కొలది పూజిస్తారు


వనదేవతలే బిడ్డలుగా పుట్టాలని


మేడారం మహా జాతరలో నెలలు నిండిన గర్భిణులూ అమ్మవార్లను దర్శించుకుంటారు. భక్తి భావంతో కొందరు మేడారంలోనే ప్రసవం కావాలని కోరుకుంటారు. వీరిలో కొందరు జాతరలోనే బిడ్డలకు జన్మనిస్తారు. ఆడపిల్లలు పుడితే సమ్మక్క, సారలమ్మ అని, అబ్బాయి పుడితే జంపన్న అనే పేర్లు పెట్టుకుని మురిసిపోతారు.


Also Read:  నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం చేస్తారు - మూడోరోజు ఎందుకు ప్రత్యేకం!


నెమలి నార చెట్టు


జాతర రెండో  రోజు నెమలి నార చెట్టు పై నాగు పాము వస్తుందని ఆదివాసులు చెబుతారు. ఈ చెట్టు బెరడు తీసుకుని వాటి  పొడి పిల్లలకు పాలలో వేసి తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో భక్తులంతా ఆ చెట్టు బెరడు తీసుకెళ్లేవారు. ఆ భారీ వృక్షం క్రమంగా ఎండిపోవడంతో ప్రస్తుతం తిరిగి మరో చెట్టుని ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా పెంచుతున్నారు. 


ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి నాలుగు రోజుల పాటూ మేడారం జాతర....సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తారు....