Andhra Pradesh Elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల రణ క్షేత్రాన్ని దడదడలాడిస్తోంది. కానీ, కూటమిలో మాత్రం కదలిక కనిపించడం లేదు. ఇప్పటికీ కూటమి లెక్కలు తేలలేదు. ఈ నెల 19, 20 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళతారని, ఎన్‌డీఏలో చేరతారని ప్రచారం జరిగింది. పవన్‌ కూడా వెళ్లి సీట్ల పంపకాలు లెక్కలు తేల్చుకుని వస్తారని ఇరుపార్టీ వర్గాలు చెప్పాయి. కానీ, ఇప్పటికీ దీనిపై స్పష్టత రాలేదు. అసల రాష్ట్రంలోని కూటమిలో బీజేపీ చేరికపై ఇప్పటికీ దోబూచులాట కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు కూటమికి ప్రతికూలంగా మారుతోందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ దశలు వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రతిపక్షాలు కంటే ముందే ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. అభ్యర్థులు ప్రకటన వైసీపీకి కొంత మేలు చేకూర్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున మాట. 


జాప్యం ఎందుకో తెలియని పరిస్థితి


రాష్ట్రంలో అధికారంలో వైసీపీని గద్దె దించేందుకు కూటమి ఏర్పాటు చేస్తున్నామని గతంలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడ్డారు. ఆ తరువాత బీజేపీ కూడా తమతో చేరుతుందని ప్రకటించారు. నెలలు గడిచినా బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఎట్టకేలకు ఈ నెల తొలి వారంలో బీజేపీ అగ్ర నేతలు నుంచి చంద్రబాబుకు పిలుపు రావడంతో కూటమిలో బీజేపీ చేరడం ఖాయమైనట్టు ప్రచారం జరిగింది. రోజులు గడస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చి రెండు వారాలు దాటుతున్నా ఈ పొత్తుల ప్రక్రియ ముందుకు కదల్లేదు. ఎక్కడ పొత్తుకు అవాంతరం ఏర్పడిందో కూడా ఇప్పటికీ బయటకు రావడం లేదు. బీజేపీ భారీగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలతోపాటు సీఎం పీఠంపై కోరిన కోరిక పొత్తు చర్చలకు అవరోధంగా మారినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ఇరు పార్టీలు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడడం లేదు. సోమ, మంగళవారాల్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ దిశగా కూడా పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో టీడీపీ, జనసేన కేడర్‌ నైరాశ్యంలోకి వెళ్లిపోతోంది. 


ఆలస్యంతో ఇబ్బందే


ఎన్నికలకు గట్టిగా అనుకున్నా రెండు నెలల సమయం కూడా లేదు. వైసీపీ రెండు, మూడు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. కానీ, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న కూటమిలో అటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికప్పుడు పొత్తుపై స్పష్టత వచ్చినా.. మూడు పార్టీలు అభ్యర్థులు ఖరారు చేయడానికి కనీసం రెండు, మూడు వారాలు సమయం పడుతుంది. ఈ ఆలస్యం పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు. కూటమిలో ఒక పార్టీకి సీట్లు ఇచ్చిన చోట.. మిగిలిన పార్టీలు నుంచి తలనొప్పులు తప్పవు. అలకలు, అసంతృప్తులను చల్లార్చడం కత్తిమీద సాముగానే పార్టీకి ఉంటుంది. వేగంగా సీట్లను ప్రకటించడం వల్ల ఇదో సానుకూలత పార్టీలకు ఉంటుంది.


వైసీపీ మంగళగిరి అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటును కేటాయించలేదు. ఆగ్రహంతో రగిలిన ఆయన కాంగ్రెస్‌లో చేరారు. వైసీపీకి ఎక్కువ సమయం ఉండడంతో సదరు నేత అసంతృప్తిని తగ్గించి మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశం వైసీపీకి ఏర్పడింది. ఇలా చాలా మంది నేతలను వైసీపీ తిరిగి పార్టీలోకి వచ్చేలా చర్చలు జరుపుతోందనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో సీట్లు ప్రకటించడం వల్ల కూటమి నేతలకు ఈ అవకాశం ఉండదని, ఎన్నికల సమయంలో జంపింగ్‌లు ఎక్కువగా ఉంటే పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని సదరు పార్టీ నేతలే వాపోతున్నారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పొత్తు ప్రక్రియ ఎప్పటికి తేల్చి ఎన్నికలకు సిద్ధమవుతారో చూడాలి.


Alos Read: ఆర్కే బాటలో వైసీపీలోకి ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు! ఆయన రియాక్షన్ వైరల్


Alos Read: 'టీడీపీకి రాజీనామా చేస్తున్నా, వైసీపీలో చేరలేదు' - త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు