Nara Lokesh Shankaravam at Payakaraopeta: ‘పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రకు చంద్రబాబు (Chandrababu) హయాంలో పరిశ్రమలు, వచ్చి ఉద్యోగాలు వస్తే.. జగన్ సీఎం అయ్యాక గంజాయి తెచ్చాడు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో రోజుకో మర్డర్, కిడ్నాప్, కబ్జాలు, దందాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జనతో తాడేపల్లి కొంపలో టీవీలు పగులుతున్నాయి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. పాయకరావుపేట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 


ఎవరు ముసలోడో.. 
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను చూస్తే జాలేస్తోందని.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని నారా లోకేష్ ప్రశ్నించారు. భూ దందాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మార్వో రమణయ్యను కొట్టి చంపారని ఆరోపించారు. ఈ మధ్య సీఎం జగన్ తండ్రి వయసున్న చంద్రబాబును పట్టుకుని ముసలోడు అంటున్నారని.. ఈ సభా ముఖంగా ఎవరు ముసలోడో తేల్చుదాం అన్నారు. ‘జగన్ బస్సు దిగాలంటే స్టూలు ఉండాలి.. శంకుస్థాపనలో రాయి పైకి ఎత్తిపెడితేకానీ కొబ్బరికాయ కొట్టే పరిస్థితి.. ఎవరు ముసలోడు?. సాయంత్రం 6 గంటల తర్వాత జగన్ కు కనబడదు. పట్టుమని ఒక గంటపాటు కూడా ఒక శాఖపై కూర్చుని సమీక్ష చేయలేడు. బైక్ నడిపితే నలుగురు పట్టుకుంటేగానీ కదల్లేని పరిస్థితి. తిరుమల కొండ, రామతీర్థం కొండకు చంద్రబాబు, జగన్ నడిస్తే ఎవరు మసలోడో ప్రజలకు అర్థమవుతుందని’ ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.


ఇక్కడి ఎమ్మెల్యేకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో తెలుసా? నన్ను, పవన్, చంద్రబాబును బూతులు తిట్టలేదని..బూతులు తిడితే టికెట్ ఇస్తానంటే తాను తిట్టలేనని చెప్పాడంతో టికెట్ గల్లంతయిందన్నారు.  నవరత్నాలు అని ఇప్పుడు బూతుల రత్నాలు ఇస్తున్నాడు జగన్. బూతుల రత్న కొడాలి నానికి ఇచ్చాడని ఎద్దేవా చేశారు. జగన్ 10వ తరగతి పరీక్షా పేపర్ లీక్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితక్కొట్టించుకున్నాడని తెలుసా అని అడిగారు. 


జగన్ నాడు- నేడు పనులు చేస్తే అబ్బో అనుకున్నారు.. కానీ 32 వేల పాఠశాల్లో ఈ కార్యక్రమం ముందుకు వెళ్లడం లేదని లోకేష్ తెలిపారు. 117 జీవో ఇచ్చి స్కూళ్లు విలీనంతో పిల్లలు చదవుకోవడానికి కొన్ని కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లల సంఖ్య తగ్గింది. డ్రాప్ అవుట్ లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. స్కూళ్ల విలీనం తర్వాత 1.70 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరమయ్యారని నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి డీఎస్సీల ద్వారా 1.75 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. 


అహంకారానికి, ప్రజలు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం
‘తాడేపల్లి, పులివెందుల, హైదరాబాద్, బెంగళూరు, రిషికొండలో రూ.500 కోట్లతో విలాసవంతమైన బంగ్లాలు ఉన్నా జగన్ తాను పేదవాడినని చెబుతున్నాడు. జగన్ అహంకారానికి, ప్రజలు ఆత్మగౌరవానికి మధ్య రాబోయే రోజుల్లో యుద్ధం జరగబోతోంది. నా పాదయాత్ర సమయంలో జీవో 1 తెచ్చాడు.. మాట్లాడే మైక్, నిలబడే స్టూల్ తో పాటు...బండి ఎక్కి చేయి ఊపానని బండి కూడా లాక్కున్నాడు. నా చేతిలో ఉన్న ఎర్రబుక్ పైనా కేసులు వేశారు. నన్ను అరెస్టు చేయాలని నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేయాలని కేసులు వేశారు. నేను ప్రజల్లో తిరిగితే, జగన్ పరదాల్లో తిరుగుతున్నాడు. నేను స్టాన్ ఫోర్డ్ యూనివవర్సిటీలో చదివితే.. జగన్ ది క్వచ్చన్ పేపర్ దొంగతనం చేసిన చరిత్ర


మేం 25 వేల కి.మీ సీసీ రోడ్లువేస్తే... జగన్ కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. నేను టీసీఎల్, హెచ్.సీఎల్, జోహో, ఫాక్స్ కాన్ వంటి పరిశ్రమలు తెస్తే, జగన్ బూమ్ బూమ్, ఆంధ్రాగోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ కంపెనీలు తెచ్చాడు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. చెత్తపన్ను, ఇంటిపన్ను పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచాడు. చంద్రబాబు తీసుకొచ్చిన అన్న క్యాంటీన్, పండుగ కానుక, పెళ్లి కానుక కట్ చేశాడు. విదేశీ విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఇచ్చే డ్రిప్ కూడా కట్ చేశాడు.


ఎన్టీఆర్. రూ.2కే కేజీ బియ్యం, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, రూ.50కే హార్స్ పవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక పెళ్లి కానుక, పండుగ కానుక, అన్నదాత సుఖీభవ, బీమా, పసుపు కుంకుమ, అన్న క్యాంటీన్..  అమలు చేశారు. ప్రజల కష్టాలు చూసి చంద్రబాబు, పవనన్న కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారని’ నారా లోకేష్ ప్రసంగంలో పేర్కొన్నారు.


నారా లోకేష్ ప్రసంగంలోని మరిన్ని అంశాలివే..
-    టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
-    ఉద్యోగం వచ్చేదాకా ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తాం.  స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి యేటా రూ.15వేలు ఇస్తాం. ఒక్కరుంటే రూ.15వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు.. ఇలా ఎంతమంది ఉన్నా ఇస్తాం. 
-    పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు అన్నదాత పథకంలో భాగంగా ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. 
-    యేటా ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను మన ప్రభుత్వం వచ్చాక అందిస్తాం. 
-    18–59 ఏళ్ల లోపు ఉన్న ప్రతి మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తాం. ఇలా యేడాదికి రూ.18,000...ఐదేళ్లలో రూ.90,000 మన ప్రభుత్వం అందిస్తుంది. 
-    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. 
-    ఈ ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి లైసెన్స్ ఇవ్వడంతో  పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు. 
-    విశాఖ ఉక్కును కాపాడతామని చెప్పి ప్రైవేటీకరిస్తున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను నిర్వహిస్తుంది. 
-    విశాఖ జిల్లాకు జగన్ తన పాదయాత్రలో 50 హామీలు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ తో పాటు విశాఖ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేస్తానని...పూర్తిచేయలేదు. 
-    8 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందిస్తామని ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. 
-    విశాఖ జిల్లాకు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువస్తామన్నారు. కోడిగుడ్డు మంత్రి దెబ్బకు ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయి. 
-    పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. రూ.1,500 కోట్లతో పాయకరావుపేటను అభివృద్ధి చేశాం. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పించాం. 
-    ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి పథకాలు ప్రారంభిస్తే, వాటిని కూడా ఈ ప్రభుత్వం పక్కదారి పట్టించింది.
-    నియోజకవర్గంలో 192 కి.మీ సీసీ రోడ్లు వేశాం. తాగునీటి పథకాలు, బీటీ రోడ్లు వేశాం. 
-   టీడీపీ, జనసేన అభ్యర్థిని గెలిపించండి ఇచ్చిన హామీలను నేను అమలు చేస్తా.
-    నా పాదయాత్రలో నేవల్ బేస్ వల్ల ఇబ్బంది పడుతున్నామని మత్య్సకారులు చెప్పారు. మన ప్రభుత్వం రాగానే సమస్యకు పరిష్కారం చూపిస్తాం.
-    స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఇంటికీ ఉచితంగా సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటాం.
-    జగన్ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక నిధులు పక్కదారి పట్టించారు. మన ప్రబుత్వం వచ్చాక చెరుకు రైతులు, కార్మికులను ఆదుకుంటాం. 
-    ఉపమాక గుడిని రూ.10కోట్లతో అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించలేదు..మన ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేస్తాం. 
-    మత్య్సకారులకు వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు, పెన్షన్లు కూడా ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రావాల్సిన సంక్షేమాలను రద్దు చేసింది. దామాసా ప్రకారం నిధులు కేటాయించి ప్రోత్సహిస్తాం.
-    4 ఏళ్ల 10 నెల్లలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు. నాపైనా కేసులు పెట్టారు...అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా పెట్టారు.
-    2019కి ముందు నేను ఏనాడూ పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. కానీ ఇప్పటికి నన్ను 7 సార్లు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయినా తగ్గేదే లేదు. 
-    ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. వైసీపీ నాయకులకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ.. టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు రా.. కదలిరా అని పిలుపునిస్తే ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వస్తారు.
-    2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి.. ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికే రూ.100కోట్లు ఖర్చుపెట్టాం. వారి పిల్లలను దత్తత తీసుకుని చదివించే బాధ్యత నా తల్లి భువనేశ్వరి తీసుకుంటున్నారు.
-    అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు నాకు లేరు.. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు. నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడుకుంటా. 
-    దాదాపు 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పనిచేశారు. తప్పుడు కేసులు పెట్టి అర్థరాత్రి అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు.
-    అరెస్టు చేసినప్పుడు రూ.3వేల కోట్ల కుంభకోణం అన్నారు... తర్వాత రూ.300కోట్లన్నారు.. ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. 
-    ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు. బాంబులకే భయపడని మేము చిల్లర కేసులకు భయపడతామా?  
-    చంద్రబాబును జైలుకు పంపిస్తే పవనన్న నాకు మొదట ఫోన్ చేశారు. ఆ సమయంలో రాష్ట్రానికి వచ్చేందుకు ప్రత్యేక విమానంలో వస్తుంటే రానివ్వలేదు. రోడ్డు మార్గంలో రావాలంటే సరిహద్దుల్లో ఆపేశారు.
-    టీడీపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు పేటియం బ్యాచ్ కుట్రలు చేస్తుంది. పెట్టని పోస్టులు పెట్టినట్లుగా చూపిస్తారు.