Mudragada Sensational Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలోకి వెళ్లేది లేదని ముద్రగడ గతంలో స్పష్టం చేయగా.. ఆ తర్వాత జనసేన నేతలు ఆయన్ను కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీలతో పొత్తుల క్రమంలో సమావేశాలతో బిజీగా మారారు. ఈ క్రమంలో ముద్రగడ అంశంపై స్తబ్ధత నెలకొంది. ప్రస్తుతం, పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనలో ఉన్న విషయాన్ని ముద్రగడ వద్ద ఆయన అనుచరులు ప్రస్తావించారట. దీనిపై స్పందించిన ఆయన.. 'మనం చెప్పాల్సింది చెప్పాం. తర్వాత మనం చేసేది ఏమీ లేదు. వస్తే ఓ నమస్కారం. రాకపోతే రెండు నమస్కారాలు.' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, గత నెలలో ముద్రగడ నివాసానికి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ రెండుసార్లు వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. ఈ క్రమంలో పవన్ తన ఇంటికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. కానీ, దాదాపు నెల రోజులుగా పవన్ ముద్రగడ నివాసానికి వెళ్లే వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీంతో తన అనుచరుల వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Also Read: Revanth Reddy campaign in AP : ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం - కాంగ్రెస్ ప్రచారం ఊపందుకోబోతోందా ?