Minister Amarnath Gifted Dall to Nara Lokesh: తాను ఒక్క రూపాయి అవినీతి చేశానని నిరూపిస్తే.. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) తనకు గుడ్డు గిఫ్టుగా పంపించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ గా ఆయన ఓ కుండలో పప్పును తీసుకొచ్చి.. దీన్ని నారా లోకేశ్ కు గిఫ్ట్ గా పంపిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు ఉప్పు, కారం కూడా పంపిస్తున్నానని అన్నారు. దీన్ని వారే వచ్చి తీసుకెళ్లినా.. లేక ఎవరైనా ఆయనకు తీసుకెళ్లి ఇవ్వొచ్చని తెలిపారు. తాను లోకేశ్ లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని.. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వల్ల మంత్రి అయ్యానని స్పష్టం చేశారు.
అభివృద్ధి కనిపించలేదా.?
నారా లోకేశ్ కంటికి అనకాపల్లి అభివృద్ధి కనిపించలేదా.? అంటూ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. 'సిగ్గు, లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేశ్. 420 వాళ్లను పక్కన పెట్టుకొని లోకేశ్ 420లా మాట్లాడుతున్నారు. మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ చేయలేకపోయారు. నువ్వేం చేస్తావు. సారాయి, గంజాయి తాగిన వాళ్లు నా గురించి మాట్లాడుతున్నారు. స్మగ్లర్లు, వీరప్పన్ లు లోకేశ్ వెంట ఉన్నారు. అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు. బంధుత్వాల గురించి మాట్లాడడానికి లోకేశ్ కు సిగ్గు లేదా.?' అంటూ ధ్వజమెత్తారు. లోకేశ్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశామని.. రెడ్ బుక్ అంటూ ఊదరగొట్టే లోకేశ్ కు అందులో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశమే రాదని ఎద్దేవా చేశారు. లోకేశ్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని.. ఆ ఎర్ర బుక్ ను తీసి ఎక్కడ మడత పెట్టుకుంటారో లోకేశ్ ఇష్టమేనని వ్యాఖ్యానించారు.
ఇదీ జరిగింది
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనకాపల్లిలోని శంఖారావం సభలో మాట్లాడుతూ.. మంత్రి అమర్నాథ్ పై విమర్శలు గుప్పించారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు పంపుతున్నట్లు చెప్పారు. 'అమర్నాథ్ అన్నకు ఈ అవార్డు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకే జాగ్రత్తగా డెలివరీ చేయమని చెబుతున్నా. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. నేను ఈ సభ వేదికగా అడుగుతున్నా. మీ నియోజకవర్గంలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా.? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా.?' అని లోకేశ్ నిలదీశారు.