Alla Ramakrishna Reddy Join To YSRCP: ఏపీ ముఖ్యమంత్రి అనుంగ శిష్యుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna ReddY) మళ్లీ సొంతగూటికి వచ్చారు. సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి ఈ మధ్యాహ్నం సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంగళగిరి నుంచి 2019లో వైసీపీ తరుఫున ఎన్నికైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ మధ్య కాలంలోనే జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయింపులు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రాజధాని విషయంలో కూడా వైసీపీ తప్పు చేసిందని కామెంట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరి రెండు నెలలు కాక ముందు సొంత గూటికి చేరారు.
మంగళగిరిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తుండటంతో ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అక్కడ ఓ బీసీ లీడర్ గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ప్రతికూల వాతావరణం ఉందని గ్రహించిన వైసీపీ ఇప్పుడు ఆర్కేను రంగం ప్రవేశం చేసింది.
ఆర్కేకు టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పిన వైసీపీ అధినాయకత్వం... చిరంజీవి విజయం కోసం పని చేయాలని దిశానిర్దేశంచేసింది. ఇక్కడ ఆర్కే ఉంటే విజయం వరిస్తుందని చెప్పిన సర్వే ఫలితాలతో ఆయన్ని దారిలోకి తీసుకొచ్చేందుకు భారీ స్థాయిలో ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read: కేంద్ర విద్యా సంస్థలు ప్రారంభం, తిరుపతి ఐఐటీ, ఐఐటీ హైదరాబాద్, వైజాగ్ ఐఐఎం జాతికి అంకితం
వ్యూహాత్మకంగా వ్యవహరించిన వైసీపీ... విజయసాయిరెడ్డిని మధ్యవర్తిగా పంపించింది. హైదరాబాద్‌లో ఆర్కేతో సమావేశమైన విజయసాయి... పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. వైసీపీ విజయం సాధిస్తే కచ్చితంగా మంచి పదవి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో గౌరవం, అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఇప్పించేలా జగన్ తో తాను మాట్లాడతానని...పాత విషయాలన్నీ మర్చిపోయి మళ్లీ వైసీపీలో పనిచేయాలని ఆయన గట్టిగా చెప్పినట్లు తెలిసింది. విజయసాయి రెడ్డి మంతనాలతో కాస్త మెత్తబడిన ఆళ్లరామకృష్ణారెడ్డి...సీఎం జగన్ తో భేటీ అయ్యేందుకు సరేనన్నారు. ఆయన్ని సోదరుడు అయోధ్య రామిరెడ్డి తాడేపల్లిలోని సీఎంవో క్యాంపు కార్యాలయానికి తీసుకొచ్చారు.
ఇటీవలే జగన్ తో విభేదించి పార్టీ నుంచి వీడిపోయిన రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీలో జయిన్ అయిన తొలి రోజే ఆర్కేకు ఝలక్ తగిలిందట. ఆయన పార్టీలో చేరిన మొదటి రోజు సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఆ భేటీకి కనీసం ఆర్కేను పిలువలేదు. లోపలికి పిలుస్తారని చాలా సమయం గేటు వద్దే వేచి చూసిన ఆయన కోపంతో వెనుదిరిగారట. పార్టీలో చేరినప్పటి నుంచి కనీసం ప్రాధాన్యత లేదని కూడా సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట.
ఆర్కేను వైసీపీలో చేర్కుకోవడం వల్ల ఇటు లోకేష్‌కు చెక్ చెప్పడంతోపాటు ఆటు షర్మిలను కూడా టార్గెట్ చేసినట్టు అవుతుందని జగన్ ప్లాన్. ఇప్పుడు ఆర్కేతో షర్మిలను తిట్టిస్తే ఆమె చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని చెబితే ఆమె వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆలోచిస్తున్నారు. అందుకే ఆర్కేను పార్టీలో చేర్చుకున్నారు.
ఒకప్పుడు జగన్ అంటే ప్రాణం ఇచ్చే ఆళ్ల.. వైసీపీకీ రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ను తీవ్రంగా విమర్శించారు. పార్టీలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని....వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయని ప్రశ్నించారు. అలాగే మంగళగిరిలోని తన కార్యాలయంలో జగన్ ఫ్లెక్సీలు, ఫొటోలు సైతం తీసి బయటపడేయించారు. త్వరలోనే అన్ని వివరాలు చెబుతానంటూ వైసీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు.