Andhra Pradesh News:  రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన స్థానికత ఉత్తర్వులు గడువు ఈ ఏడాది జూన్‌ రెండో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కొనసాగింపు తదితరు అంశాలను పరిశీలించి ఉత్తర్వులు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. స్థానికత ఆధారంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కోటా సవరణ లేదా కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రభభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఎనిమిది ఉన్నతాధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో ఈ కమిటీ నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. స్థానికత కోటా అంశంపై విద్యార్థులు, అసోసియేషన్లు, యూనియన్లు, నిపుణులు నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖ, సహకారశాఖ, పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉండనున్నారు. మానవ వనరులు, సర్వీసులశాఖ కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అడ్మిషన్ల రంగంలో నిపుణులు ఒకరు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏపీ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్డర్‌ 1974, ఉన్నత విద్యలో రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు అమలు అవుతున్న రిజర్వేషన్లు తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 


వారి అంశాలు పరిశీలన


రాష్ట్ర విభజన సమయంలో ఆలస్యంగా స్థానికత పొందిన వారికి సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు. అడ్మిషన్ల చట్టం 1974 ప్రకారం అడ్మిషన్లలో స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. విభజన చట్టం  2014 పేరా 5లో పేర్కొన్న దాని ప్రకారం అన్ని విద్యా సంస్థల్లో అడ్మిషన్ల అంశంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా స్తానికత అడ్మిషన్లు కొనసాగింపుపై ఈ కమిటీ విధి, విధానాలు రూపొందించనుంది. 3710-డి ప్రకారం విభజనకు ముందున్న ఉమ్మడి ఏపీలోని విద్యార్థులకు విభజన అనంతరం ఏర్పాటైన ఏపీలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. దీనిపై కమిటీ పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఉత్తర్వులిచ్చి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం పేర్కొన్న స్థానికత అనే అంశాన్ని నిలిపివేయాలా..? లేదా కొనసాగించాలా..? అనే అంశంపైనా చర్చించనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. విభజన జరిగిన పదేళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా ఈ తరహా ఇబ్బందులు ఉండడం ఇబ్బందిని కలిగిస్తోందని పలువురు పేర్కొన్నారు. విభజనకు సంబంధించి అంసపూర్ణంగా ఉన్న సమస్యలు, ఈ తరహా చిక్కులను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.