Telangana CM Revanth Reddy: షాద్‌నగర్: ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి, ఒక్కరోజు కూడా అమరుల స్థూపం వద్ద పువ్వు పెట్టని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సీఎం కావడం బాధాకరం అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. గతంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ పట్టుకొని పోయిన వ్యక్తిని ఈరోజు అసెంబ్లీలో సీఎం కుర్చీలో చూస్తే చాలా బాధగా ఉందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. గంటలో షాద్‌నగర్‌లో ఉంటా అన్నారు. తన ఇల్లు కొంచెం ఇటుసైడే ఉంటదని, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే మీ ఫోన్ కాల్ తో గంటసేపట్లో వచ్చేస్తానని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు పెట్టినా అధైర్యపడొద్దని.. కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
ఉద్యమకారుల పోరాట ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు. నిప్పు అంటించుకొని అమరుడు అయ్యాడు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అన్నారు. ఈ సందర్భంగా అమరులు అందరికీ హరీష్ రావు జోహార్లు. చావు నోట్లో తల పెట్టీ కేసీఆర్ తెలంగాణ సాధించారు. కానీ రాష్ట్ర సాధనలో ఏ పాత్రలేని వ్యక్తి నేడు తెలంగాణ సీఎం అయ్యారంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం కావడం బాధాకరం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో షాద్ నగర్ ఎంతో క్రియాశీలకంగా పాల్గొంది. బీఆర్ఎస్ పార్టీకి కూడా అండగా నిలిచిందన్నారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో 7 వేల ఓట్లతో ఓడిపోయాం, కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు వారికి ఓటు వేశారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు
రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయని... మొన్నటి ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, మళ్లీ స్పీడ్ అందుకుంటామని దీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షం అయినా మనం ప్రజల పక్షాన ఉండాలన్నారు. వారి వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చింది తమ పార్టీ అన్నారు. మార్పు అని కాంగ్రెస్ నేతలు ఎన్ని మాటలు చెప్పారో ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారని.. త్వరలోనే గ్యారంటీలు అమలు చేయాలన్నారు. ఏదో చేస్తారనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారు. కేసీఆర్ నల్లగొండలో గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు హరీష్ రావు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరులో 13 గ్యారెంటీలు ఉన్నాయి. కానీ రెండు అయిపోయాయని ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 50 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 2500 ఇవ్వడం లేదని, బడ్జెట్ లో నిధులు పెట్టలేదు అన్నారు. గ్యారెంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల పేరిట మోసం చేశారని, ప్రమాణ స్వీకారం మాత్రం త్వరగా చేశారు, హామీల అమలు మాత్రం చేయడం లేదని సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరోనా సమయంలో అప్పటి సీఎం కేసీఆర్.. అధికారులు, ఎమ్మెల్యేలకు పైసలు ఆపి రైతులకు ఇచ్చాడన్నారు. కరోనా సమయంలోనూ తాము రైతు బంధు ఇవ్వగా, ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం కాంగ్రెస్ నేతలు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. రైతులకు పంట బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా చూపించాలన్నారు. ఉద్యోగాల విషయంలో సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఉందని.. హామీల గురించి అడిగితే అసెంబ్లీలో తప్పుడు శ్వేత పత్రాలతో డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
‘అబద్ధాలు తప్ప నిబద్దత లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్, తెలుగు దేశం పాలకులు 1984 నుండి 2014 దాకా ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ద్వారా నీళ్ళు ఇవ్వలేదు. వారు 27,300 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, మేము పదేళ్లలో 6.36 లక్షల ఎకరాలుకు నీళ్ళు ఇచ్చాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పనులు పూర్తి అయ్యాయి. కాలవలు తవ్వితే నీళ్ళు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఆ పని పూర్తి చేయాలి. నీళ్ళు ఇవ్వాలి. బీజేపీ, కాంగ్రెస్ రెండు పాలమురును మోసం చేశాయి. జాతీయ ప్రాజెక్ట్ తేవడంలో రెండు పార్టీలు విఫలం. బీఆర్ఎస్ వచ్చాకనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది.
21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. నెలకు 10 వేలు వారికి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. వ్యంగం బంద్ చేసి, భూతులు బంద్ చేసి రైతుల మీద ప్రేమ చూపాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారు. మహబూబ్ నగర్ ఎంపి బీఆర్ఎస్ గెలవాలి. భవిష్యత్తు మనదే ఇది నిజం తథ్యం. కార్యకర్తలు కష్టపడాలని’ హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.