Chalo Delhi: మొక్కజొన్న, పత్తి లాంటి పంటలను పాత మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఐదేళ్ల కాంట్రాక్ట్‌ను కేంద్రం తిరస్కరించడంతో రైతులు మరోసారి కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మరోసారి పంజాబ్ లోని శంభు సరిహద్దులో ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 19) సాయంత్రం ఫిబ్రవరి 21 నుంచి ఢిల్లీకి తమ పాదయాత్రను పునఃప్రారంభించాలని రైతుల సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మళ్లీ పూర్తి స్థాయిలో నిరసనలు కొనసాగించేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని బద్దలు కొట్టేందుకు రైతులు పొక్లెయిన్ లాంటి యంత్రాలను కూడా ఢిల్లీ సరిహద్దులకు చేర్చుతున్నారు. మరోవైపు, పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్లను రెడీ చేస్తున్నారు. వాటి నుంచి ఎదుర్కోవడానికి రైతులు ఆ మెషిన్ల క్యాబిన్లకు మందపాటి ఐరన్ షీట్లతో కవర్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి మరిన్ని యంత్రాలు త్వరలో నిరసన తెలిపే రైతుల వద్దకు చేరుకుంటాయని భావిస్తున్నారు. అవసరమైనప్పుడు పోలీసులు, భద్రతా సిబ్బంది ఉంచిన బారికేడ్లను బద్దలు కొట్టడానికి వారు ట్రాక్టర్లను కూడా తీసుకువస్తున్నారు. రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేసేందుకు రేపు ఉదయం 11 గంటల వరకు గడువు ఇచ్చారు.
సోమవారం నాలుగో విడత చర్చలు విఫలం
కిసాన్ మోర్చా చీఫ్ జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు రైతులకు ప్రయోజనం కలిగించబోవని తేల్చి చెప్పారు. దీంతో తాము నిరసన కొనసాగించాలని అనుకుంటున్నామని.. కానీ, ప్రభుత్వం రైతుల డిమాండ్లను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. రైతుల నిరసనను కూడా పలుచన చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టులో సిఫార్సు చేసిన మద్దతు ధరకు సంబంధించిన ‘సీ-2 ప్లస్ 50 పర్సెంట్’ ఫార్ములా కంటే తక్కువ కాకుండా.. రైతులు దేనికీ అంగీకరించబోరని ఆయన తేల్చి చెప్పారు.
అంతకుముందు రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చల సందర్భంగా.. ముగ్గురు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, నిత్యానంద రాయ్, పీయూష్ గోయల్‌లు ప్రభుత్వం తరపున చర్చల్లో పాల్గొన్నారు. కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. తమ డిమాండ్లను ఆమోదించకుంటే ఫిబ్రవరి 21న ఢిల్లీకి పాదయాత్ర చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు.
అయితే, నాలుగు పంటలకు ఎంఎస్‌పీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వరి, గోధుమలతో పాటు, కందిపప్పు, మినపప్పు, మొక్కజొన్న, పత్తి పంటలపై కూడా MSP ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. అయితే దీని కోసం రైతులు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) నుంచి అనుమతి పొందాలని.. వారు ఐదు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో ఆందోళన విరమించాలని పీయూష్ గోయల్ రైతుల సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. దాన్ని రైతులు ఒప్పుకోకుండా ఫిబ్రవరి 21 నుంచి ఛలో ఢిల్లీకి పిలుపు ఇచ్చారు.