Muddaraboina Venkateswarao Resigned To Tdp: ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని టీడీపీ నూజివీడు (Nuzividu) నియోజకవర్గం ఇంఛార్జీగా నియమించడంతో.. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (Muddaraboina Venkateswararao) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో తన కార్యాలయంలో ఉన్న టీడీపీ పోస్టర్లను తొలగించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, తాను వైసీపీలోనూ చేరలేదని.. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పార్థసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోకపోయినా.. పార్టీ నూజివీడు ఇంఛార్జీగా ప్రకటించారని.. మీకు, మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ మండిపడ్డారు.
'పని చేసినా గుర్తింపు లేదు'
ఉరిశిక్ష వేసే ముందు కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరికను అడుగుతారని.. కానీ కనీసం పార్టీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని ముద్దరబోయిన ఆవేదన వ్యక్తం చేశారు. 'వైసీపీలో చేరినట్లు నేనేమైనా చెప్పానా.?. సీఎంవోలో ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించాను. సీఎంను ఎవరైనా కలవొచ్చు కదా?. పదేళ్లు నన్ను వాడుకొని బయటకు గెంటేశారు. నూజివీడులో చచ్చిపోయిన పార్టీని బతికించాను. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా పని చేశాను. పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీ చేయాలని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ సీటిచ్చారు. మరి ఈ రోజు నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.' అని వాపోయారు.
కాగా, 2024 ఎన్నికల్లో పెనమలూరు టికెట్ కొలుసు పార్థసారథికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించడంతో ఆయన సైకిల్ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పెనమలూరు నుంచి పార్థసారథి అభ్యర్థిత్వంపై సర్వే సైతం నిర్వహించారు. అయితే, ఇక్కడి టీడీపీ ఇంఛార్జ్ బోడె ప్రసాద్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో పార్థసారథిని నూజివీడు నుంచి బరిలో దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే పార్థసారథి సైతం టీడీపీ కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన అనుచరుల సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయన సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది.
టీడీపీ ఇంఛార్జీగా పార్థసారథి
ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సీఎం జగన్ ను కలిసిన నేపథ్యంలో.. కొలుసు పార్థసారథిని నూజివీడు టీడీపీ ఇంఛార్జీగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెనువెంటనే ముద్దరబోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కీలక స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలకు అవి దక్కకపోవడంతో పార్టీలు మారుతున్నారు. దీంతో ఈసారి పొలిటికల్ వార్ అత్యంత ఆసక్తికరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.