YSRCP News: నరసరావుపేట: ఏపీలో గత కొన్ని రోజులుగా నేతలు పార్టీలు మారడం కామన్ అయిపోయింది. వైసీపీలో గౌరవం లేదని, నమ్మకం ఉంచినా తనకు సీట్లు ఇవ్వడం లేదని కొందరు పార్టీ మారారు. మరికొందరు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీలోనూ తమకు అవమానాలు ఎదురవుతున్నాయని, అలాంటి చోట ఉండలేమంటూ కేశినేని నాని లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోవడం చూశాం.
ఈ క్రమంలో వైసీపీలో అవమానాలు ఇక భరించే ఓపిక లేదంటూ జగన్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తిరిగి జగన్ వద్దకే వచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైసీపీలో చేరారు. ఇదే బాటలో మరికొందరు నేతలు అని ప్రచారం జరుగుతోంది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తిరిగి వైసీపీ గూటికి చేరతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి జగన్ నాయకత్వంలో పని చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. తాను ఎవ్వరి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదని, ఎవరినో కలవాలని చూడటం లేదని, ఎవరిని దేనికోసం ప్రాథేయపడటం లేదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని లావు శ్రీకృష్ణదేవరాయలు తన ట్విట్టర్ ద్వారా కోరారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు కొన్ని రోజుల కిందట వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన నరసరావుపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ పై స్పష్టత రాకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతకుముందు పలుమార్లు సీఎం జగన్ తో భేటీ అయి విషయంపై కృష్ణదేవరాయలు చర్చించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో ఫ్యాన్ పార్టీని వీడారు. ఇటీవల నరసరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఇంఛార్జ్‌గా నియమించారు.
నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, యువతకు ఉద్యోగాలు, వ్యాపార సంస్థల పెంపు విషయాలపై తాను ఫోకస్ చేశానని చెప్పారు. తన ఎంపీ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆస్పత్రితో పాటు పల్నాడులో పీఎం గతి శక్తి కింద లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలనేదే తన లక్ష్యమన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత రాలేదు.