Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇప్పటికే ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ డేట్‌ను వాయిదా వేసుకొని ఫైనల్‌గా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. తాజాగా సినిమాపై ప్రేక్షకులను ఆసక్తిని పెంచడం కోసం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో మీడియాతో పాటు ఫ్యాన్స్ కూడా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీమ్‌ను ప్రశ్నలు అడిగింది. ముఖ్యంగా వరుణ్ తేజ్‌ను అడిగిన ప్రతీ ప్రశ్నకు తను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విలన్ రోల్స్ గురించి అడిగిన ప్రశ్నకు వరుణ్.. చాలా ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు.


ఏదంటే అది చేస్తాను..


మెగా ఫ్యామిలీలోని హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ అలాంటివి చాలా అరుదుగానే జరుగుతుంటాయి. తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రెస్ మీట్‌లో కూడా వరుణ్ తేజ్‌కు అదే ప్రశ్న ఎదురయ్యింది. మల్టీ స్టారర్ చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారని ఆశించవచ్చు అని ప్రశ్నించారు. ‘‘మా ఫ్యామిలీలో పెద్దవాళ్లు చరణ్, బన్నీ, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి గారు.. వాళ్లు చేయనిది అంటూ ఏదీ లేదు. వాళ్లతో ఏదంటే అది చేస్తాను. వాళ్లతో చిన్న క్యారెక్టర్ దొరికిన చేస్తాను’’ అని అన్నాడు. ఒకవేళ విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడగగా.. ‘‘ఒకవేళ మా బాబాయ్ వాళ్లతో నేను విలన్ క్యారెక్టర్ చేస్తే తంతారు. అది ఊహల్లోకి కూడా రాదు కానీ యాక్టర్‌గా అయితే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే ఆశ నాకు కూడా ఉంది’’ అని మనసులోని మాటను బయటపెట్టాడు వరుణ్ తేజ్.


పెళ్లికి, సినిమాకు సంబంధం ఏంటి..


టాలీవుడ్‌లో హీరోహీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన మొదటిసారి ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలకు సిద్ధమయ్యింది. అయితే దీనిపై తన స్పందన ఏంటని అడగగా.. ‘‘పెళ్లికి, సినిమాకు సంబంధం ఏంటి’’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు. అంటే జీవితంలో ఒక భాగస్వామి వస్తే కలిసొస్తుంది అంటారు కదా అనే మాటకు వరుణ్ స్పందించాడు. ‘‘తన నా జీవితంలోకి వచ్చినప్పటి నుండే మంచి జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏం లేదు’’ అని సమాధానమిచ్చాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ షూటింగ్ సమయంలో తనకు మర్చిపోలేని మూమెంట్ ఏది అని అడగగా.. 40 రోజులు నిజమైన ఎయిర్ బేస్‌లో షూటింగ్ జరిగిందని, అక్కడ మూవీ టీమ్ అంతా దాదాపు 200 మంది చాలా ఎంజాయ్ చేశామని, ఆ అదృష్టం అందరికీ దొరకదని తెలిపాడు వరుణ్.


రామ్ చరణ్ ప్రశంసలు..


తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్‌ను రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయించింది మూవీ టీమ్. ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘ఓపీవీ ఫైనల్ స్ట్రైక్ వచ్చేసింది. చాలా భారీగా కనిపిస్తోంది. ఇలాంటి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్నందుకు నా తమ్ముడు వరుణ్ తేజ్‌ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈసారి ఈ సినిమా మొత్తం దేశాన్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది’ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. మార్చి 1న ‘ఆపరేషన్ వాలెంటైన్’ను థియేటర్లలో చూడడానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న వరుణ్ తేజ్‌కు జోడీగా మానుషీ చిల్లర్ నటించింది. నవదీప్, రుహానీ శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.


Also Read: తల్లికాబోతున్న దీపికా పదుకొనె? - బేబీ బంప్‌ ఫొటో వైరల్‌!