Mauni Amavasya 2024 in Telugu: పుష్యమాసం అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల కన్నా మౌని అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉందంటారు. ముఖ్యంగా పితృదోషాలు తొలగి వారి ఆశీస్సులు పొందేందుకు ఈ అమావాస్యను చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.  2024 లో ఫిబ్రవరి 9 శుక్రవారం అమావాస్య వచ్చింది. ఈ రోజు శ్రీమహా విష్ణు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చేయడం మంచిది.  ఈ రోజున చేసే దానధర్మాలు అంతులేని ఫలితాలను ఇస్తాయి. ఈరోజున చేసే పూజ, ఉపవాసం... కుటుంబం, సంతాన అభివృద్దికి దోహదం చేస్తాయి. అయితే మౌని అమావాస్య రోజు మౌనంగా ఉండాలనే ప్రచారం జరుగుతోంది...


Also Read: ఈ అమావాస్య నుంచి కొన్ని రాశులవారికి మంచి రోజులు మొదలవుతున్నాయ్!


మౌని అమావాస్య తిథి  


2024 ఫిబ్రవరి 09 శుక్రవారం ఉదయం 7.49 నుంచి అమావాస్య ప్రారంభమై ఫిబ్రవరి 10 శనివారం తెల్లవారు జామున అంటే సూర్యోదయానికి ముందే 4 గంటలలోపే ముగిసిపోతోంది. అందుకే మౌని అమావాస్య శుక్రవారమే అయింది. ఆయా ప్రదేశాలను బట్టి సమయం ఓ రెండు మూడు నిముషాలు మారుతుంది. 


మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండాలా!


పేరులోనే మౌనం ఉంది కాబట్టి ఈ అమావాస్యకి అందరూ మౌనం పాటించాలనే ప్రచారం జరుగుతోంది. అయితే అవగాహన లేనివారు చేస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు పండితులు. మౌనం అంటే భగవదారాదనలో గడపడం అని అర్థం. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి, అవసరం లేని చర్చల్లో పాల్గొనకుండా ఉండాలనే సూచనే కానీ మాట్లాడొద్దని కాదు. 


Also Read: ఫిబ్రవరి 9 మౌని అమావాస్య, ఈ రోజు ఇవి పాటించడం మర్చిపోవద్దు!


సనాతన ధర్మం ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయంటారు. ఎవరైతే అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలను పాటిస్తారో వారి జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. మౌని అమావాస్య సందర్భంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ఉత్తమం. మౌని అమావాస్య రోజున ఉసిరికాయలను దానేం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చెబుతారు.  


అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు



  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి...ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్టా దేవి మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది

  • అమావాస్య రోజు తల స్నానం చేయకపోవడం కూడా దరిద్రమే..అందుకే తలస్నానం చేయాలి. తలంటుకోరాదు

  • ఎట్టిపరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు, మధ్యాహ్నం సమయంలో నిద్రపోరాదు

  • అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవడం ఉత్తమం

  • అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు వదిలితే ఆ ఇంటికి మంచి జరుగుతుంది

  • పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ దానంగా ఇవ్వొచ్చు

  • అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టుకత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు

  • అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాసుకోరాదు

  • అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది

  • శాస్త్ర ప్రకారం ఈ రోజున కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు, కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదు

  • ఈ రోజున అన్నదానం, వస్త్రదానం విశేషం, లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం


Also Read: మౌని అమావాస్య రోజు ఈ రాశులవారిపై పెద్దల ఆశీస్సులు ఉంటాయి , ఫిబ్రవరి 09 రాశిఫలాలు