Mauni Amavasya 2024 Date and Time:  ఏటా పుష్యమాసం ఆఖరి రోజు అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల కన్నా చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యం ఉందని చెబుతారు. ముఖ్యంగా పితృదోషాలు తొలగి వారి ఆశీస్సులు పొందేందుకు చొల్లంగి అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. సాధారణంగా అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వచనం కోసం  తర్పణం, పిండప్రధానం, దానాలు నిర్వహిస్తారు. అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్య మరింత విశేషమైనది. 2024 లో ఫిబ్రవరి 9 శుక్రవారం అమావాస్య వచ్చింది. ఈ రోజు శ్రీమహా విష్ణు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చేయడం మంచిది.  ఈ రోజున చేసే దానధర్మాలు అంతులేని ఫలితాలను ఇస్తాయి. ఈరోజున చేసే పూజ, ఉపవాసం... కుటుంబం, సంతాన అభివృద్దికి దోహదం చేస్తాయి. 


సముద్ర స్నానం అత్యంత ముఖ్యం


 అమావాస్య రోజు సముద్రస్నానం అత్యంత ఉత్తమం. ఈ రోజు సముద్రస్నానం చేసినవారికి సకల దోషాలు నశిస్తాయని చెబుతారు. సముద్ర స్నానం కుదరని వారు నదీస్నానం చేసిన వారికి అన్ని దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుందని భీష్ముడు వివరించాడు. నదీ స్నానం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని, వారి ఆశీస్సులు దొరుకుతాయని విశ్వాసం.


Also Read: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆచరించకూడని విధులివే!


సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి


పితృ దోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.  రాగి పాత్రలో నల్ల నువ్వులు, ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.


రావి చెట్టు పూజ


పుష్యమాస అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం వల్ల సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. రావిచెట్టుకి నీరు సమర్పించి దీపం వెలిగించి..చుట్టూ దారం కడుతూ 108 ప్రదక్షిణలు చెయ్యాలి. 


Also Read: ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి, ఆ రోజుకున్న విశిష్టత ఇదే!


దానం - ఉపవాసం


చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఇంకా నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో ఉంది. 


యాచకులను అవమానించవద్దు


అమావాస్య రోజున భిక్షాటన కోసం మీ ఇంటికి వచ్చిన వారిని వట్టి చేతులతో పంపకండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా వారికి ఆహారం, దుస్తులు లేదా ఏదైనా దానం చేయండి. 


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


జీవులను హింసించవద్దు


అమావాస్య రోజ మూగజీవాలకు హాని కలిగించవద్దు. ముఖ్యంగా వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు లేదా ఆహారం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌వద్దు. అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఆహారం తినిపిస్తే పూర్వీకులు ప్రసన్నమ‌వుతార‌ని నమ్మకం.  


చీమలకు ఆహారం ఇవ్వండి


మౌని అమావాస్య రోజు పిండిలో పంచదార కలపి చీమలకు ఆహారంగా ఇవ్వాలి. చీమలు ఐకమత్యానికి నిదర్శనం. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి. అందుకే శ్రమైక జీవనానికి నిదర్శనమైన చీమలకు ఆహారం వేస్తే గ్రహ బాదల నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్రపండితులు