కార్తీకమాసం నెలరోజుల పాటు భక్తిభావంలో మునిగితేలే తెలుగు లోగిళ్లు మార్గశిర మాసంలో అంతకుమించి అన్నట్టుంటారు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలుసిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.  శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మహా లక్ష్మికీ మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఎవరైతే థ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు.  ఈ నెలరోజుల్లో అత్యంత ముఖ్యమైనది మార్గశిర లక్ష్మివారం (గురువారం).
మార్గశిర లక్ష్మివారం పూజ ఎలా చేయాలంటే..
మార్గశిర మాసంలో వచ్చే ప్రతిగురువారం లక్ష్మీపూజ చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కళకళలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.  తలకి స్నానం చేసి దేవుడి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి యధావిథిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప,ధూప,అష్టోత్తరం , నైవేద్యంతో స్త్రీసూక్తం విధానంలో  షోడసోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటారు పెద్దలు. 
”ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌” అనే మంత్రాన్ని పఠించాలి.  పూజ పూరైన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు లక్ష్మీవారవ్రత కథ చెప్పుకు ని అక్షతలు తలపై వేసుకోవాలి. 
Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
అమ్మవారికి ఏ వారం ఏ నైవేద్యం
1 వ గురువారం – పులగం
2 వ గురువారం – అట్లు, తిమ్మనం
3 వ గురువారం –  అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం – చిత్రాన్నం, గారెలు
5 వ గురువారం – పూర్ణం బూరెలు
ఐదవ వారం  ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. అయితే మార్గశిర లక్ష్మివారం వ్రతంలో పూర్తైన తర్వాత అమ్మవారికి ఉద్యాపన చెప్పే ప్రక్రియ ఉండదు. ఎందుకంటే ఉద్వాసన అంటే వెళ్లి..మళ్లీ పిలిచినప్పుడు రమ్మని అర్థం. ఎవరైనా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండాలనుకుంటారు కానీ వెళ్లిరామ్మా అనరు కదా..అందుకే లక్ష్మీదేవికి ఉద్వాసన చెప్పరు. 
పాటించాల్సిన నియమాలు
ఈ నోము నోచే స్త్రీలు లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసు కోవడం చేయరాదు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు.  నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు. 
Also Read: కర్మ అంటే ఏంటి.. పదే పదే ఈ మాట అనొచ్చా.. పురాణాలు ఏం చెబుతున్నాయి...
మార్గశిర లక్ష్మీవార వ్రత కథ
పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనం లోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి దగ్గర పెరుగుతుంది. తనకి పుట్టిన పిల్లల్ని ఆడించమని చెప్పి సవతితల్లి సుశీలకి బెల్లం ఇచ్చేది.  ఓ వైపు పిల్లల్ని ఆడిస్తూనే..సవతి తల్లి చేస్తున్న పూజలు చూసిన సుశీల..మట్టితో మహాలక్ష్మి బొమ్మ చేసి జిల్లేడుపూలు, ఆకులతో పూజ చేసి సవతి తల్లి తనకి తినమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది. కొన్నాళ్లకి ఆమెకు పెళ్లికావడంతో తాను చేసుకున్న మట్టి బొమ్మను తీసుకుని అత్తవారింటికి వెళ్లింది. అయితే సుశీల అత్త వారింటికి వెళ్ళినప్పటి నుంచీ కన్నవారింట కష్టాలు మొదలయ్యాయి. అలాంటి పరిస్థితిలో అక్క ఇంటికెళ్లి ఏమైనా తీసుకురమ్మని చెప్పి తనయుడిని పంపిస్తుంది సవతి తల్లి.  పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల.. ఓసారి వెదురు కర్రలో వరహాలు పెట్టిస్తుంది, మరోసారి వరహాల మూట ఇస్తుంది, ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దానిలోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి ఇస్తుంది. అయితే ఆ మూడుసార్లు మార్గమధ్యలో ఆ ధనం పోగొట్టుకుని ఒట్టి చేతులతోనే ఇంటికెళతాడు సుశీల సోదరుడు. 


కొన్నాళ్లకి స్వయంగా సవతి తల్లి కుమార్తె ఇంటికి వెళుతుంది. అమ్మా..ఈ రోజు మార్గశిర లక్ష్మివారం వ్రతం చేసుకుందాం అని చెబుతుంది. అయితే పిల్లలకి చద్దన్నం కలుపుతూ నోటిలో వేసుకోవడంతో నోముకి పనికిరాదు. రెండో వారం పిల్లలకు నూనె రాస్తూ ఆమె రాసుకుంటుంది, మూడోవారం చిక్కులు తీసుకుని తలదువ్వుకుంటుంది, నాలుగోవారం అరటిపండు తినేస్తుంది. విసిగిపోయిన కుమార్తె ఐదోవారం తల్లి వెన్నంటే ఉండి వ్రతం చేయిస్తుంది. అప్పుడు కూడా అమ్మవారి కరుణ లభించదు. సుశీల ప్రార్థించగా.. నీ చిన్నతనంలో మీ అమ్మ చీపురుతో కొట్టిందని అందుకే ఆ ఇంట ఉండలేనంటుంది లక్ష్మీదేవి. తప్పు క్షమించమని వేడుకున్న సుశీల తల్లితో నిష్టగా మార్గశిర లక్ష్మివారం వ్రతం చేయిస్తుంది. అప్పటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.


మార్గశిర లక్ష్మివారం వ్రతం చేసేవారు అమ్మవారి పూజ, నైవేద్యం అనంతరం ఈ వ్రతకథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. వ్రతం తప్పినా భక్తి ప్రధానం అన్న విషయం మరిచిపోరాదని చెబుతారు పండితులు.
Also Read:భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి