Makar Sankranti 2023:  సూర్యుడి లేలేత కిరణాలు..మెరిసే మంచుబిందువులు...కోడి కూతలు..ఎర్రగా పండిన గోరింటాకు చేతులు.. వెచ్చని బావి నీళ్లు..బంతి చామంతిల కమ్మని సువాసనలు..రంగవల్లులు..గొబ్బిళ్లు..భోగిమంటలు..గంగిరెద్దులూ, హరిదాసులు.. పిండివంటలు.. సంప్రదాయ దుస్తులు..కొత్త అల్లుళ్లు.. కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు, ఎడ్ల పందాలు, పశువుల పూజలు..ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. ఇవన్నీ సంక్రాంతి వేళ పల్లెటూర్లలో కనిపించే దృశ్యాలు..ఇన్ని ఆనందలు కాంక్రీట్ జంగిల్లో సాధ్యమవుతాయా?...అందుకే సంబరాల సంతోషాన్ని క్షణం క్షణం రెట్టింపు చేసే పల్లెటూర్లకి పరుగులుతీస్తారంతా. 


Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!


నగరాల్లో ఏ ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు..అంతెందుకు పక్కింట్లో కూడా ఎవరున్నారో అర్థమేకాదు. పండుగ, పబ్బం, సందడి ఏమీ ఉండదు. పైగా ప్రాంతాల, మతాలు, కులాలు అంటూ కొన్ని అడ్డుగోడలు ఇంకా ఏ మూలో మిగిలే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం నుంచి పుట్టిపెరిగిన ప్రాంతాలకు వెళ్లి పండుగల చేసుకోవడం కన్నా ఆనందం ఇంకేముంటుంది. పల్లెటూర్లు కూడా అప్పటిలా లేవు మారిపోయాయి అని అనేవారూ ఉన్నప్పటికీ...నగరాలతో పోల్చుకుంటే చాలా ఆనందాలు పల్లెటూర్ల సొంతం. అందుకే సొంతూర్లకు ఎంత దూరంలో ఉన్నా..సంక్రాంతి వచ్చేసరికి పల్లెటూర్లకు పరుగులు తీస్తారు. ఊరుని తలుచుకోగానే వచ్చే ఆనందం ఒకెత్తైతే..పుట్టిన ఊరి మట్టివాసన తగలగానే ఆ ఉత్సాహమే వేరు. పంటపొలాల చుట్టూ పరుగులు పెట్టిన జ్ఞాపకాలు, చెరువుల్లో ఈతలు, చిన్ననాటి స్నేహితులతో ముచ్చట్లు...ఇలా ఎన్నో తీపి గుర్తులను మనతో పాటూ తీసుకెళ్లి..  మరిన్ని జ్ఞాపకాలను పోగుచేసే పండుగే సంక్రాంతి. 


Also Read:  సంక్రాంతికి ఇంటిముందు ముగ్గుల్లో 'కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!


సంక్రాంతి వచ్చేనాటికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తుంది. రైతు కళ్లు ఆనందంతో చెమరుస్తాయి. ఆ ఆనందం పండుగకు కొత్త కళ తెస్తుంది. అన్నదాత ఆనందంగా ఉంటే ప్రతిరోజూ పండుగే అన్న మాట కూడా వాస్తవమే కదా. దుక్కు దున్నినప్పటి నుంచీ యజమానికి సహకరించే ఎద్దులు, పండిన పంటను బస్తాలకెత్తి ఇంటికి చేర్చేప్పుడు సంబరంగా పరుగులు తీస్తాయి. తనని పూజిస్తున్న యజమానికి వరాలిచ్చాం అన్నంత ఆనందం వాటిలో ఉరకలేస్తుంది. ఆ కృతజ్ఞత తోనే కనుమ రోజు పశువులతో పని చేయించకుండా వాటిని పూజిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సందర్భంగా పాటించే ప్రతి పద్ధతీ ఆనందమే..ప్రతి మలుపూ ఆసక్తే. ఒక్కమాటలో చెప్పాలంటే.. పండుగకు ఊరెళ్లడం వెనుక ప్రధాన కారణం పల్లెలకే పరిమితమైన సంబరాన్ని చూసేందుకే..


సంక్రాంతి తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ అయనా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర-గుజరాత్‌లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్-హర్యానాల్లో లోరీ అని పిలుస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మాఘి అంటారు. పేరేదైనా ఈ పండుగ సందర్భం, సంతోషానికి కారణాలు అన్ని చోట్లా ఒకటే. ఎక్కడైనా ఇది రైతుల పండుగే.  ఎప్పుడూ మనమే అనే భావన కన్నా..నలుగురితో మనం అనే భావన మరింత ఆనందాన్నిస్తుంది. సంక్రాంతి పరమార్థం కూడా అదే.  మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడమే అసలైన పండుగ అని చెబుతోంది. పంటలు పండి ధాన్యం ఇళ్లకి చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయడం చాలా మంచిదని చెబుతారు. అందుకే కుటుంబంతో సంతోషంగా గడపడమే కాదు...దాన ధర్మాలు చేసేందుకు కూడా సంక్రాంతి మంచి సమయం...