Maha Shivratri Secrets : సాధకులకు అత్యంత విశిష్టమైన రోజు శివరాత్రి. ఈ రోజుకి ఎంత విశిష్టత ఉందో ఈ రెండు కథల ద్వారా తెలుసుకోండి


కాశీ ఖండంలో ఉన్న కథ ప్రకారం


యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మమణుడికి లేక లేక ఓ కొడుకు పుట్టాడు. పేరు గుణనిథి. చిన్నప్పుడే ఒడుగు చేయించి దైవకార్యాలు చేయించేవాడు. యుక్తవయసు వచ్చిన తర్వాత దేవుడిపై ఉండే భక్తిని యవ్వనంలో ఉండే విషయాలపై పెట్టాడు. రాజ పురోహితుడిగా విధి నిర్వహణలో పనిచేసే తండ్రి తనయుడిని పట్టించుకోలేదు..తల్లి చూసి కూడా కుమారుడి తప్పులను సరిదిద్దడం మానేసింది. అలా గుణనిధి వేశ్యావాటికకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఓసారి రాజుగారి ఆస్థానంలో నృత్యం చేసిన ఓ వేశ్య వేలికి ఉంగరం చూసి ఆశ్చర్యోపోయాడు మహారాజు. ఆ ఉంగరం ఆమె దగ్గరకు ఎలా వెళ్లిందంటూ ఆరాలు తీసినా భార్య నిజం చెప్పదు. అప్పటికే చేయిదాటిపోయిన కొడుకు గుణనిధిపై నిఘా పెట్టాడు తండ్రి యజ్ఞదత్తుడు. ఎప్పుడైతే తండ్రికి మొత్తం తెలిసిందని అర్థమైందో ఇంటి నుంచి పారిపోయాడు. రోజంతా ఆకలితో ఉండిపోయాడు..  ఏమీ దొరక్క అర్థరాత్రి సమయంలో గర్భగుడిలో అడుగుపెట్టాడు. అక్కడ చీకటిగా ఉందని తన ఉత్తరీయం చించి పక్కనే ఉన్న నూనెలో ముంచి దీపం వెలిగించాడు. అక్కడున్న ప్రసాదం గిన్నె పట్టుకుని పారిపోతుండగా..ఆలయం బయట ఉన్నవారు చూసి దొంగ దొంగ అని అరిచి కొట్టి చంపేశారు. ఆ గుణనిథి చనిపోయిన తర్వాత యమభటులు వస్తే..అడ్డుకుని శివదూతలు కైలాశానికి తీసుకెళ్లాలి అని చెప్పారు. ఎందుకు అని అడిగితే..అప్పుడు శివదూతలు ఇలా చెప్పారు. శివరాత్రి రోజు ఉపవాసం  చేశాడు, జాగరణ చేశాడు, దీపం వెలిగించాడు, శివలింగాన్ని దర్శించుకున్నాడు, ప్రసాదం గన్నె చేత్తో పట్టుకుని ప్రాణం విడిచాడు..ఇంతకన్నా పుణ్యం ఏముంటుందని యమభటులకు చెప్పిన శివదూతలు గుణనిధిని కైలాశానికి తీసుకెళ్లారు. 


Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!


లింగ పురాణం ప్రకారం మరో కథ


ఓ వేటగాడు అడవికి వెళ్లి ఎంత వెతికినా జంతువు ఏదీ దొరకలేదు. ఆకలితో ఉన్నాడు చీకటి పడింది..ఇంతలో సింహం వెంటపడింది. వెంటనే ఆ పక్కనే ఉన్న చెట్టెక్కాడు. ఆకలి, దాహం వేస్తోంది. పక్కనే ఉన్న సొరకాయ బుర్రలో నీళ్లున్నాయేమో చూశాడు కానీ  చెట్టెక్కే క్షణంలో తల తగిలి ఆ నీళ్లు కిందపడ్డాయి. చెట్టుపై నిద్రపోతే కింద పడిపోతే సింహం తినేస్తుందనే భయంలో ఉన్నాడు. అందుకే నిద్రరాకుండా ఉండేందుకు చెట్టు ఆకులు తెంపి కిందకు వేయడం మొదలు పెట్టాడు. ఏంటి లింగమయ్యా ఈ పరిస్థితి అంటూ నిందాస్తుతి చేశాడు. తెల్లారేసరికి శివదూతలు వస్తే ఎందుకు అని అడిగాడు. ఆ చెట్టుకిందే శివలింగం ఉంది..చెట్టెక్కేటప్పుడు నీళ్లు పోశాడు, ఆ తర్వాత వేసిన ఆకులు మారేడు దళాలు, తిడుతూనే శివయ్యని తలుచుకున్నాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో ఇంతకుమించి పుణ్యం ఏముంటుంది..అందుకే నీకు శివసాయుజ్యం లభించిందని చెప్పారు శివదూతలు.. 


 మహా శివరాత్రి రోజు చేసే జాగరణ, ఉపవాసం, అభిషేకం, నమస్కారం, శివ స్తుతికి ఎంత విశిష్టత ఉందో ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.  అంటే ఎన్ని పాపాలు చేసినా శివరాత్రి రోజు శివపూజ చేస్తే తొలగిపోతాయా అని అర్థం చేసుకోవడం కాదు.. పాపం చేయాలనే ఆలోచన కూడా రాకూడదన్నదే  ఈ కథల వెనుక ఆంతర్యం.


 ఓం శివోహం... 


Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!


Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!