Annamayya District | ఓబులవారిపల్లె: అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏనుగుల గుంపు చేసిన దాడిలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండలం గుండాల కోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడి చేశాయి. సోమవారం రాత్రి 14మంది గుండాలకోనకు అటవీ మార్గంలో కొందరు భక్తులు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏనుగుల గుంపు భక్తులపై దాడి చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
శివరాత్రిని పురస్కరించుకుని వై కోటకు చెందిన భక్తులు శేషాచలం అడవులలో గుండా తలకోనకు కాలి నడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏనుగులు ఒక్కసారిగా భక్తుల మీదకు దూసుకొచ్చి దాడి చేశాయి. గట్టిగా కేకలు వేస్తూ భక్తులు పారిపోయేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముగ్గురు భక్తులు చంగల్ రాయుడు, తుపాకుల మణెమ్మ, దినేష్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరిని తిరుపతి రుయాకు తరలించారు. ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల దాడులు జరగకుండా చూసేందుకు గతంలో నిర్ణయం తీసుకుంది.
ఏనుగుల దాడిలో భక్తుల మృతిపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల గుంపు దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరికొందరు గాయపడిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం…
అన్నమయ్య జిల్లా గుండాల కోనలో ఏనుగుల తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికారులను వివరాలు ఆరా తీశారు. ఏనుగుల దాడిలో చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.
Also Read: Tragedy at Guntur Goshala: గుంటూరు జిల్లాలో విషాదం, గోశాలలో కరెంట్ షాక్‌తో నలుగురు మృతి