Maha Shivratri Best of Shiva songs:    కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో శివుడి ప్రస్తావన, పాట తప్పనిసరిగా ఉంటుంది. అదికూడా ఏదో కథలో ఇరికించే ప్రయత్నం కాదు..కథలో భాగంగా అలా కలసిపోతుంది..


కళాతపస్వి సినిమాలు టాలీవుడ్ పై ఇతర ఇండస్ట్రీలకు ప్రత్యేక అభిమానం ఏర్పడేలా చేశాయి. కళను ఆరాధించేవారిలో ఆర్థ్రత నింపాయి. ఎక్కడున్నామో మరిచి కూర్చున్నచోటే అలా మత్తులో ఉన్నట్టు నిల్చుని నమస్కారం పెట్టేలా చేశాయ్. 


శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఎలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ప్రేక్షకులకు అందించిన విశ్వనాథ్ కి పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టం. అందుకే విశ్వనాథ్ సినిమాల్లో శివుడి ప్రస్తావనో, పాటో తప్పనిసరిగా ఉంటుంది. అప్పట్లోనే కాదు ఇప్పటికీ విశ్వనాథ్ మూవీస్ సాంగ్స్ విని ఆహా అననివారుండరు  



సిరివెన్నెల సినిమాలో  ఆదిభిక్షువు వాడినేది కోరిది బూడిదిచ్చేవాడినేది అడిగేదంటూ ఓ పాట ఉంటుంది. అది వాస్తవానికి ఇద్దరి ప్రేమికుల మధ్య డిస్కషన్. నీ కోరిక నెరవేరాలంటే శివయ్యను ప్రార్థించు అని తనని ఆరాధించే అమ్మాయి చెబుతుంది. ఆ మాటకి హీరో రియాక్షన్ ఈ పాట.  బూడిదిచ్చే వాడిని ఏం అడగాలి, తియ్యని పాటలుపాడే కోకిలకు నలుపు రంగు అద్దినవాడిని ఏం అడగాలి, గర్జనలతో భయపెట్టే మేఘాలకి మెరుపు అద్దిన వాడిని ఏం అడగాలంటూ నిందాస్తుతి చేస్తాడు. శివలీల, శివతత్వం ఏంటో చెప్పడమే కాదు...మనం ఏం అడిగినా కానీ మనకు ఏం ఇవ్వాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు అని చెప్పే ప్రయత్నం ఇది. 



సాగరసంగమం...అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాలో ప్రతి పాటా ఆణిముత్యమే. జీవితంలో ఓడిపోయి.. అయినవారిని, ప్రేమించిన అమ్మాయిని కోల్పోయి..కలలు నెరవేరక, కళ ప్రదర్శించే అవకాశం రాక ..జీవితం మొత్తం నిర్వేదంతో నిండిపోతుంది. ఆ సమయంలో ఉండే ఆలోచనే నరుడి బ్రతుకి నటన ఈశ్వరుడి తలపు ఘటన అని. మనిషి జీవితానికి ఈశ్వరతత్వాన్ని ముడిపెట్టిన ఈ పాట గురించి వర్ణించేందుకు అద్భుతం అనే పదం చిన్నది అవుతుంది. 



అల్లరిగా, చిలిపిగా ఉండే అమ్మాయిలో నివురుగప్పిన నిప్పులా ఉండే కళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే స్వర్ణకమలం. ఇతర దేశాలకు చెందినవారంతా మన కళపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కానీ ఆ కళను ప్రదర్శించగల నేర్పు ఉండి కూడా ఆసక్తి లేదన్న కారణంతో వెనకడుగు వేస్తుంటుంది హీరోయిన్. అసలైన ఆనందం, జీవితానికి పరిపూర్ణత వచ్చేది కళను అందంగా ప్రదర్శించినప్పుడే అని చెబుతూ నడిపించే కథనం ఇది. ఆమెలో అసలైన కళాకారిని మేల్కొన్నప్పుడు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ సిల్వర్ స్క్రీన్ పై ఆమె చేసే తాండవం ప్రతి శివభక్తుడిని తన్మయత్వానికి గురిచేస్తుంది.  



మనిషిని, కులాన్ని, మతాన్ని కాదు..వారిలో కళను చూడండి అంటూ వచ్చిన చిత్రం శంకరాభరణం.  తాను తీసుకువచ్చిన మనిషిలో కళను కాకుండా ఆమె అనుసరించే వృత్తిని చూసి అంతా వదిలివెళ్లిపోతే..శివుడుని శంకరశాస్త్రి ప్రశ్నించిన తీరే ఈ పాట. శివుడుని నిందిస్తూ ధారాపాతంగా వాన కురుస్తున్నా పట్టించుకోకుండా..పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివగంగ అంటూ ప్రశ్నించే తీరు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది



పంచభూతాలు అంటే భూతాలు దయ్యాలు అనుకునేవాళ్లు ఇప్పటికీ అక్కడో ఇక్కడో ఉంటారండోయ్. పాపం ప్రేక్షకుల చప్పట్లపై కాన్సన్ ట్రేట్ చేసిన ఆ కళాకారిణికి కూడా అలానే అర్థమైంది. కానీ  ఆ భూతనాథుడైన శివుడి అధీనంలో ఉంటుంది మొత్తం ప్రకృతి. అందుకే శివం పంచభూతాత్మకం అని ప్రార్థిస్తారు. ఈ అర్థాన్ని తెలియజెప్పే ప్రయత్నం..కళాకారుల ఆలోచన, దృష్టి ఎలా ఉండాలో చూపించిన అసలు సిసలు కళాకారుడు.. 


ఇంకా కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల్లో శివుడి పాటల గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయ్.