Arvind Kejriwal not going to Rajya Sabha:  న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా లూధియానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆప్ ప్రకటించిన వెంటనే..  రాజ్యసభకు కేజ్రీవాల్ అని సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా సైతం రిపోర్ట్ చేసింది. అయితే అవన్నీ వదంతులేనని.. సంజీవ్ అరోరా స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్దల సభకు కేజ్రీవాల్ అనే ప్రచారం వదంతులు మాత్రమేనని, ఇలాంటి విషయాలను నమ్మవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలోకి ప్రవేశించారనే మీడియా నివేదికలను ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. లూధియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయాలని సంజయ్ అరోరా భావిస్తున్నారు. ఆయన నిర్ణయానికి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓకే చెప్పారు. లూధియానా వెస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. 

ఢిల్లీలో ఓటమి అనంతరం పంజాబ్ నేతలతో భేటీ

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫిబ్రవరి 11న పంజాబ్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, కీలక నేతలతో కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశం అయ్యారు. పంజాబ్ ఆప్ నేతలతో భేటీ అనంతరం లూధియానా అసెంబ్లీ స్థానం నుండి కేజ్రీవాల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు ఆప్ లో అంతర్గత విభేదాలున్నాయని, అందుకే కేజ్రీవాల్ పంజాబ్ లో యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. లూధియాని వెస్ట్ నుంచి పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది. దాంతో ఆయన స్థానంలో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని కొత్త ప్రచారం ఊపందుకుంది. వీటిలో నిజం లేదని, ఢిల్లీ ఆప్ వర్గాలు ఆ వదంతులను కొట్టిపారేశాయి.

ఎమ్మెల్యేగా సైతం ఓడిన కేజ్రీవాల్

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఎమ్మెల్యేగా సైతం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత  పర్వేశ్ వర్మ చేతిలో కేజ్రీవాల్‌ ఓడిపోయారు. 62 సీట్లతో ఉన్న కేజ్రీవాల్ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితం కావడంతో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు.

అవినీతిపై పోరాడిన యోధుడిగా కనిపించిన మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కేజ్రీవాల్ చివరకు అవినీతి మరకలు అంటుకుని అధికారానికి దూరమయ్యారు. తాను రాజకీయాలకు వెళ్లొద్దని కేజ్రీవాల్ కు ముందుగానే సూచించానని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. రాజకీయాల్లో ఉంటే ఎన్నికలకు వెళ్లేటప్పుడు క్లీన్ చిట్ గా ఉండాలని, అవినీతి ఆరోపణలు ఉండొద్దని అన్నా హజారే అభిప్రాయపడ్డారు.

Also Read: Karnataka: భోజనం చేశాక కాసేపు కునుకు తీయడానికి రిక్లైనర్లు - కర్ణాటక ఎమ్మెల్యేలకు స్పీకర్ బంపర్ ఆఫర్