Maha Mrityunjaya Mantra
ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మనిషికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని దీర్ఘాయువును, ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చేదే మహా మృత్యుంజయమంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్రం దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అత్యంత ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. అందుకే ఈ మంత్రం జపించిన వారంతా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారని భక్తుల విశ్వాసం.
మహా మృత్యుంజయ మంత్రాన్ని సంజీవని మంత్రం అని, మార్కండేయ మంత్రం అని కూడా అంటారు. అనుకోని ఆపదలు చుట్టుముట్టినప్పుడు, బతుకుపై విరక్తి కలిగిప్పుడు..కాసేపు ఈ మంత్రాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతారు.
సకల రోగాల నుంచి ఉపశమనం కల్పించి, అపమృత్యు భయాన్ని తొలగించి, ప్రమాదాల నుంచి రక్షించే శక్తి ఈ మంత్రానికి ఉంటుందంటారు.
అర్థ ఏంటంటే
అందరికి శక్తి నిచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివుడిని నేను పూజిస్తున్నాను. దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టు మృత్యు బందనం నుంచి నన్ను విడిపించి అమరత్వాన్ని ప్రసాదించగాక..
Also Read: విష్ణువుకే కాదు శివుడుకీ దశావతారాలున్నాయి - అవేంటంటే!
ఈ మంత్రాన్ని నిత్యం 3 సార్లు, 9 సార్లు కుదిరితే 108 సార్లు పారాయణం చేస్తారు. ఈ మంత్రాన్ని భక్తిపూర్వకంగా జపిస్తే దైవ ప్రకంపనలు మొదలై, చుట్టూ ఆవరించి ఉన్న దుష్ట శక్తులు మాయమవుతాయి. ఎందుకంటే ఈ మంత్రాన్ని పఠించిన వారి చట్టూ ఓ శక్తివంతమైన వలయం ఏర్పడుతుందని చెబుతారు. అందుకే ప్రమాదాల బారినుంచి , దురదృష్టం నుంచి బయటపడేందుకు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. ప్రాతః కాలంలో అయినా సంధ్యా సమయంలో అయినా ఎప్పుడైనా మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించవచ్చు.
ఓం
భగవంతుడు సూక్ష్మ జ్యోతిగా వెలిగిన వెంటనే ఓం నాదం వినబడిందనీ అదే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెబుతారు. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మ సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుంచి ‘అ‘ కారం. యజుర్వేదం నుంచి ‘ఉ‘ కారం, సామవేదం నుంచి ‘మ‘ కారాలు .. ఈ మూడింటి సంగమంతో ఉద్భవించిన ఓంకారం అత్యంత శక్తివంతం. అందుకే ప్రతి మంత్రం ఓం అని ప్రారంభమవుతుంది. ఓంకారం శుభాన్ని కలిగిస్తుంది.
త్ర్యంబకం
భూత, భవిష్యత్, వర్తమానాలకు ప్రతిరూపం త్రినేత్రం. శివుని నుదుటి మధ్యలో ఉన్న సూక్ష్మరూప నేత్రం మూడవది. దీనినే జ్యోతిర్మఠం అంటారు. శివుడు మూడో కన్నుకి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.అందకే త్యంబకం అని కీర్తిస్తున్నాం.
Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!
యజామహే
యజామహే అంటే..ధ్యానిస్తున్నా అని అర్థం. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే అంతకు మించిన శుభం ఏముంది. పాలసముద్రం నుంచి బయటకు వచ్చిన విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్న స్వామిని ప్రార్థించడం కన్నా ఈ జన్మకు ధన్యం ఏముంటుంది.
సుగంధిం
సు అంటే మంచిదైన, గంధ అంటే సువాసన ద్రవ్యాన్ని వెదజల్లినట్టు తన భక్త వాత్సస్యంతో సుగంధాన్ని వెదజల్లుతున్నాడు శంకరుడు. ఆయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ. అందుకే మందిరం అడగడు, అలంకారాలు అడగడు, భారీ పూజలు అడగడు. ఓ చెట్టుకింద శివలింగం పెట్టి చెంబుడు నీళ్లు, బిల్వదళాలు వేస్తే చాలు పొంగిపోతాడు
పుష్టి వర్థనం
సకలచరాచరా సృష్టంతా శివుడి అధీనంలోనే ఉంది. ఆయనే అందర్నీ కాపాడుతాడు. అందుకు ఉదాహరణే గుహుడి కథ. గుహుడనే వేటగాడు ఓ రోజు వేటకు వెళ్లి అలసిపోయాడు. చీకటి పడినా కానీ ఒక్క జంతువు దొరకలేదు. ఈలోగా పులి గాండ్రింపు వినపడడంతో చెట్టెక్కాడు. అది మారేడు వృక్షం. ఆ పులి చెట్టుకిందే ఉండంతో దానిని అదిలించేందుకు ఆకులు తెంపి విసరడం మొదలుపెట్టాడు. ఆ కిందనే శివలింగం ఉందని ఆ వేటగాడికి తెలియదు. ఆ రోజు శివరాత్రి. పులి ఉందని ఆకులు వేయడం ఆపలేదు..వేటగాడు దిగివస్తాడని పులి అక్కడి నుంచి కదల్లేదు. తెల్లారిపోయింది. అలా తెలియకుండా వేటగాడు, పులి చేసిన దీక్షకు మోక్షం ప్రసాదించాడు.
ఉర్వారుక మివ బంధనాత్
దోసకాయ పక్వానికి వచ్చిన వెంటనే తొడిమను తెంపాల్సిన అవసరం లేదు. దానంతట అదే విడిపోతుంది. అలా భగవానుడిని మనం అడగాల్సిన అవసరం లేదు..భక్తితో ప్రార్థితే సమస్యల నుంచి ఆయనే గట్టెక్కించేస్తాడు
Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!
మృతోర్ముక్షీయ
అపమృత్యు భయాన్ని తొలగించి, మృత్యువు నుంచి కాపాడే సర్వేశ్వరుడు శంకరుడే. మృత్యువు అంటే భౌతిక మరణం కాదు ఆధ్యాత్మికంగా చేతనం లేకపోవడం కుడా మృత్యు సమానమే. భక్తి లేని ఈ జీవితం నిర్జీవమే.
అమృతాత్
ఆయన శిరస్సు పైన కాసిని నీళ్లు చిలకరించినా వాటిని అమృతంగా మార్చి అందిస్తాడు. అందుకే శ్రీనాథుడు ఇలా స్తుతించాడు
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు