Siva Tatwam


విందు భోజనాలప్పుడు శంకరుడికి ఆహ్వానం ఉండదు..విషాహారానికి మాత్రం అగ్రస్థానం కట్టబెట్టారు


పట్టువస్త్రాలు పంపిణీ సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఏనుగు చర్మాన్ని మాత్రం శివయ్యకే కట్టబెట్టారు


గంగాస్నానాల్లో ఆనందంగా మునకలేసేందుకు అందరూ సిద్ధమే.. ఆకాశం నుంచి దూకిన గంగమ్మను నిలువరించేందుకు శివుడే కావాలి


అందుకే మరి భోళా శంకరుడు అంటారంతా.. భక్తులు ఇలా పిలిస్తే అలా పలికి వరాలను అనుగ్రహించే భగవంతుడు ఈశ్వరుడు


తొందరపాటు తనంతో పీకలమీదకు తెచ్చుకుంటాడు..అయినా కానీ మోకరిల్లగానే వశుడైపోతాడు.. 


దుర్మార్గుడినీ ప్రేమించడమే దైవత్వం అంటే అని చాటిచెప్పాడు పరమేశ్వరుడు.. అదే కదా మరి శివతత్వం


Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!


 భారీగా అలంకారాలు అవసరం లేదు, నిండుగా నైవేద్యాలు అక్కర్లేదు..పాయసాన్నాలు నివేదించాల్సిన అవసరం లేదు.


చెంబుడు నీళ్లు గుమ్మరిస్తే చాలు..పొంగిపోతాడు. 


నాలుగు మారేడు దళాలు భక్తితో సమర్పిస్తే చాలు పట్టలేనంత ఆనందిస్తాడు. 


పూలమాలలు, అలంకారాలు ఏమీ అక్కర్లేదు..చిటికెడు విభూధి తీసి మీ నుదుటన పెట్టుకుని ఆయనకు అద్దితే చాలు మురిసిపోతాడు. 


చర్మం కట్టుకుని తిరిగే నిరాడంబరుడు..విషపు నాగులు, రుద్రాక్షలే ఆభరణం


బిచ్చమెత్తుకుని బతికేస్తాడు.. శ్మసానమే తన నివాసం అంటాడు


పోనీ సిగలో చంద్రుడు ఉన్నాడు కదా అని చూసి ఆనందిద్దాం అంటే..అది కూడా నిండు చంద్రుడు కాదు సన్నని రేఖ మాత్రమే


Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే


శివయ్య ప్రమథ గణాలైన నందీ, భృంగీ అంతకు మించి అని చెప్పుకోవాలేమో. పర్వతరాజు హిమవంతుండి ఇంట శివయ్యతో ఈ దండుని చూసి తన కుమార్తె పార్వతి జీవితం ఎలా సాగుతుందో అని బెంగపడిపోయాడట.


ఇంత నాసిరకం అయిన జీవితాన్ని గడుపుతున్న శంకరుడు ఎలాంటి సందేశం ఇస్తాడు అనే సందేహం రావొచ్చేమో మీకు..కానీ జీవిత సారం మొత్తం అందులోనే కదా ఉంది. చూపులు ఆకాశంలో కాదు నేలపై ఉంచండి, ఎవ్వరైనా కాలిన తర్వాత బూడిదే అవుతారని గుర్తించండి అని చెప్పాడు. అందం ఆభరణాల్లో కాదు ఆలోచనల్లో, మీరు అనుసరించే విధానాల్లో ఉందని చూపించాడు. 


శివుణ్ణి మించిన స్త్రీ పక్షపాతి మరొకరుండరు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని ఇప్పుడు చెప్పడం ఏంటి అప్పట్లోనే చెప్పాడు.. కాదు కాదు.. ఆచరించి చూపాడు. నటరాజుగా నృత్యం చేస్తూ తనలో తాను ఆనందించడమే కాదు..ఆనందంలో భార్యకు భాగం ఇచ్చిన ప్రేమభాగస్వామి 


ఇలా..కోపం, కరుణ, హాస్యం, ప్రేమ, అనురాగం అన్నింటిలో ఆయన ఆదిదేవుడే. అందుకే శివుడిని దేవుడిగా కాదు..నీ స్నేహితుడిగా చూడు.. నీ పక్కనుండే వ్యక్తిని ఎలా గమనిస్తావో అలా గమనించి చూడు. అప్పుడే ఆయన్ను చేరుకోగలవు...ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలవు అంటారు పండితులు.  


Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే


నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ
త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ
మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయ నమః 


2025 ఫిబ్రవరి 26 మహా శివరాత్రి...


ఓం నమః శివాయ