యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం.. కర్నూలు జిల్లాలోని ఈ సుప్రసిద్ధ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమంటారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది? దీని వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకోవాలంటే ఆలయ చరిత్ర తెలుసుకోవాలి.


వేంకటేశ్వర స్వామిని రీప్లేస్ చేసిన శివయ్య 
వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా నల్లమలకు వచ్చిన అగస్త్య మహాముని కొండల మధ్య వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్టించేందుకు వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది. అవయవలోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం  కైలాసాన్ని పోలి ఉన్నందున  తానే కొలువుదీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి.. ఉమా మహేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది.


Also Read: మిగిలిన దేవుళ్లకన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం
పెరిగే నంది
 వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది. దాన్ని శివ గుహ అని అంటారు. అక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణుక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్తుడైన హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునఃనిర్మించారు.  ఆలయంలో నంది విగ్రహం పెరగడంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టు ప్రదక్షిణలు చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదంటారు. అయితే, నందిగా చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు గానీ, వీడియోలుగానీ లేకపోవడం వల్ల చాలామంది అదంతా ప్రచారమే అనికొట్టిపడేస్తారు కానీ… నంది సైజు పెరగడం మాత్రం వాస్తవమేనని భక్తులు చెబుతుంటారు. భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం ఒక్క అంగుళం మాత్రమే పెరుగుతోంది. అంటే ఏడాదికి కేవలం ఒక్క మిల్లీ మీటరు చొప్పున నంది ఎదుగుతోంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది. 


శాస్త్రీయ కారణం
నంది పెరగడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందంటారు శాస్త్రవేత్తలు. యూరప్‌లోని రోమేనియాలో కూడా రాళ్లు పెరుగుతూ ఉంటాయట. అవి నంది విగ్రహం కన్నా వేగంగా పెరగడమే కాదు, పిల్లల్ని కూడా పెడతాయని చెబుతారు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ అందతా వీటిలో జీవం ఉండడం వల్ల కాదు… కేవలం రసాయానిక క్రియ వల్ల అంటారు. రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు పెరుగుతుంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి. అవి మళ్లీ కిందపడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయని కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి.


Also Read:శివం పంచభూతాత్మకం అని ఎందుకు అంటారు
రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి. కానీ, వర్షకాలం వచ్చేసరికి క్రమంగా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇందుకు కారణం.. ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్లలో అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు పెరుగుతూ ఉంటాయి. అయితే, రొమేనియా రాళ్లలో ఉన్న కాల్సియం కార్బొనేట్, సోడియం సిలికేట్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి… కానీ రోమేనియా రాళ్లకీ, మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది.


మిగతా శివాలయాల్లో నందులు పెరగవెందుకు
మరి మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదు? వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయానిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగకపోవడానికి కారణాలు ఏంటని చాలామంది అడుగుతారు. అయితే, వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే, భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడి మాయేనని విశ్వసిస్తారు.


ఈ నంది లేస్తే కలియుగాంతమే… 
యాగంటి నంది లేచి రంకెలేసినప్పుడు కలియుగం అంతం అవుతుందని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఉందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయంలో వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. వెంకటేశ్వరస్వామి విగ్రహం బొటన వేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్న అగస్త్యుడికి కాకులు తపోభంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట. అప్పటి నుంచి అక్కడ కాకులే కనిపించవు. అయితే కాకుల్ని నిషేధించిన క్షేత్రంలో తానుండను అన్నాడట శనిదేవుడు. అందుకే ఆలయం లోపల నవగ్రహాలు సైతం ఉండవు. ఇక్కడి కోనేరులోకి నీరెలా వస్తుందో తెలియదు కానీ... ఏడాది పొడవునా నీరుంటుంది. యాగంటి ప్రత్యేకత గురించి ఇంతకన్నా ఏం చెప్పగలం అంటారు స్థానికులు.