శివం అంటే మంగళం. పరమేశ్వరుడు మంగళప్రదాత. ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపుడు. సృష్టిలోని అణువణువూ కొలువైఉండే స్వరూపం.
శివుడు ఎలా ఉద్భవించాడు
ఓసారి బ్రహ్మ-విష్ణు మధ్య నేనెక్కువ అంటే నేనెక్కువ అనే అహంకారం తలెత్తింది. ఎవరెంత గొప్పవారో తేల్చుకోవాలనే స్థితికి చేరుకుంది. వారిని వాస్తవంలోకి తీసుకొచ్చేందుకు మాఘమాసం చతుర్దశినాడు వారిద్దరి మధ్యా  "జ్యోతిర్లింగంగా" రూపుదాల్చాడు శివుడు. లింగానికి ఆద్యంతాలు తెలుసుకునేవారే గొప్పవారన్నాడు శివుడు. విష్ణుమూర్తి అడుగు భాగాన్ని వెతుకుతూ.....బ్రహ్మ పై భాగాన్ని వెతుకుతూ వెళ్లారు. వెతుక్కుంటూ వెళ్లిన బ్రహ్మకు కామధేనువు కనిపించింది. ఎక్కడినుంచి వస్తున్నావ్ అని ప్రశ్నించగా....అభిషేకం చేసి పైనుంచి వచ్చానంది. ఆ తర్వాత కనిపించిన మొగలిపువ్వు....లింగంపై నుంటి కిందకు జారానని చెప్పింది. అయితే తాను జ్యోతిర్లింగం ఆది... చూశానని సాక్ష్యం చెప్పమని బ్రహ్మ కామధేనువుని, మొగలిపువ్వుని కోరాడు. అంతం కనుక్కోలేకపోయానని విష్ణువు చెప్పగా....తాను ఆది...చూశానని సాక్ష్యం ఇదిగో అని బ్రహ్మ చెప్పాడు. ఆగ్రహించిన శివుడు బ్రహ్మ శిరస్సు ఖండించాడు. అలా ఖండించిన శిరస్సు పడిన క్షేత్రమే బ్రహ్మ కపాలం. అదే సమయంలో అబద్ధం చెప్పిన మొగలిపువ్వు పూజకు పనికిరాదని, ఆవు ముఖం చూస్తే మహాపాపం అని శాపం ఇచ్చాడు పరమశివుడు.


మిగిలిన దేవుళ్లకన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం 
దేవుళ్లంతా నిత్య అంలంకరణలో కనిపిస్తారు. మరి శివుడెందుకు కనిపించడనే సందేహం వస్తుంది. అయితే శివుడు కూడా సర్వాలంకార భూషితుడే. కానీ ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఓ రూపంలో దేవతలను అనుగ్రహిస్తే...మరో రూపంలో అఘోరాలతో పూజలందుకుంటాడు....ఇంకో రూపంలో యోగులను కరుణిస్తే....నాలుగో రూపంలో కన్నుల పండువగా కనిపిస్తూ మానవాళిని ఉద్ధరిస్తాడు. 



  • తేజోవంతుడిగా, ధ్యానంలో కూర్చుని, ప్రశాంతంగా ఉండే శివుడిని చూస్తుంటాం. తూర్పుముఖంగా ఉండే ఆ ముఖాన్ని తత్పురుషం అంటారు. ఇలా కనిపించే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడట. ఈ రూపానికి పూజలందించేది కూడా దేవతలే అంటారు.

  • దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో...అత్యంత భయంకరంగా ఉండే రూపాన్ని అఘోరం అని పిలుస్తారు. కపాలాలనే కుండలాలుగా ధరించి, త్రినేత్రం తెరిచి శవాలవైపు  చూస్తూ కనిపిస్తాడు శివుడు. ఈ రూపాన్ని దర్శించుకునేది, పూజించేది కేవలం అఘోరాలే. భూతప్రేతాలను అదుపులో ఉంచి మనల్ని కాపాడే అఘోర రూపం భయంకంపితంగా ఉంటుంది. 

  • శివుడంటే లింగరూపమే.....నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది శివలింగానికే....అభిషేక ప్రియమైన ఈ రూపాన్ని సభ్యోగాతం అంటారు. లింగ రూపంలో ఉన్న ముక్కంటికి యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారట.

  • పరమేశ్వరుడు కూడా అలంకార ప్రియుడే. ధ్యానంలో ఓసారి, దిగంబరంగా మరోసారి, లింగరూపంలో ఇంకోసారి కనిపించే పరమేశ్వరుడు...గౌరీపతిగా, సర్వాలంకార భూషితుడిగా పూజలందుకుంటాడు. దీన్నే వామదేవం అంటారు. మిగిలిన రూపాల్లో కనిపించని విధంగా శివుడు అలంకారాలతో, పక్కన అమ్మవారు, విఘ్ననాధుడు, కుమారస్వామి, నంది తో కన్నులపండువగా కనిపిస్తాడు. సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలు, సత్సంతానంతో తులతూగాలని మానవాళిని ఆశీర్వదించే రూపం ఇది. ఆలయాల్లో మినహా ఇంట్లో ఎక్కువగా పూజించేది ఈ రూపాన్నే. 
    ఈశాన్యం ముఖంలో కనిపించే పరమేశ్వరుడు అత్యంత ప్రియభక్తులను మాత్రమే అనుగ్రహిస్తాడట.

  • సృష్టి అంతా ఒకటే అని చాటి చెప్పేది శివలింగం. ఆద్యంతం ఒంపుల్లేకుండా ఒకేలా కనిపిస్తుంది. ఇక రూపంలో పరమార్థం.....మెడలో సర్పం, శిరస్సుపై గంగ - కుండలిని జాగృతిని సూచిస్తాయి.

  • శివనామంలో మూడుగీతలు - జాగృతి, స్వప్న, సుషుప్తి స్థితులను తెలియజేస్తాయ్.

  • మూడోకన్ను ఆజ్ఞానాన్నిప్రారదోలేదిగా చెబుతారు.  పాక్షికంగా మూసినట్టుండే కళ్ళు అంతర్ముఖస్థితికి దర్పణం. 

  • శివుడు తొలిగురువు, యోగ గురువు, వృత్తి భిక్షాటన, కూర్చునేది పులిచర్మంపై, చుట్టుకునేది గజచర్మం, నివాసం శ్మశానం..ఇవన్నీ జన్మబంధ విమోచనా మార్గాలకు సూచన.


ముక్కంటికి గుణాల్లేవు, కల్పాల్లేవు, ఎక్కడైనా ఉంటాడు, ఎలా కొలిచినా కరుణిస్తాడు...ఒక్కమాటలో చెప్పాలంటే సృష్టిలో అన్నింటికీ ఆరాధ్య భూతం పరమశివుడే. ఆ లయ కారుడు లింగరూపంలో ఉద్భవించినదే శివరాత్రి.


Also Read:  శివం పంచభూతాత్మకం అని ఎందుకు అంటారు


Also Read: లయకారుడైన శివుడి ప్రత్యేకత ఏంటి, అర్థనారీశ్వర తత్వం ఏం చెబుతోంది, శివరాత్రి ప్రత్యేక కథనాలు