K. Viswanath: సినిమా తెరకెక్కించే క్రమంలో వృత్తి, ఉద్యోగం, కులం, ఆయా కులాల ఆహార్యానికి సంబంధించి ఏ చిన్న ప్రయోగం చేసినా దానిపై పెద్ద రచ్చే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. కానీ అప్పట్లోనే ఓ విమర్శకు కూడా తావివ్వకుండా ఎన్నో సాహసాలు చేశారు కళాతపస్వి కె.విశ్వనాథ్..ఆయన చేసినవన్నీ ఓ రకంగా ప్రయోగాలు,సాహసాలే అని చెప్పుకోవాలి. వాటిలో ఒకటి వింతతు వివాహం. అది కూడా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతున్న గుడిలో ఆ కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారి మెడలో పడాల్సిన తాళిబొట్టు ఓ వెర్రిబాగుల కుర్రాడు ఓ వింతతు మెడలో కట్టడం.. ఈ సన్నివేశం ఇలా తెరకెక్కించాలి అనుకోవడం సాహసం కాదా..!


గుడిలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరుగుతూ ఉంటుంది.. ఓవైపు కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తూ పాట సాగుతుంటుంది. రామయ్య.. అదుగోనయ్యా.. రమణీ లలామ.. నవ లావణ్య సీమ.. ధరాపుత్రి సుమ గాత్రి.. నడయాడి రాగా రామా కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా అంటూ పాట సాగుతూ ఉంటుంది..అదే సమయంలో లలిత పాత్ర ఆలయంలోకి అడుగుపెడుతుంది.. అక్కడున్న భక్తులంతా సీతారాముల కళ్యాణాన్ని భక్తిపారవశ్యంలో మునిగి చూస్తుంటాడు. లౌక్యం తెలియని మనసు ఎదగని కథానాయకుడు ఆడిపాడుతుంటాడు. సాధారణంగా పెళ్లిళ్లలో తాళికట్టే ముందు ఆ తాళిబొట్టుని ముత్తైదువులు అందరి దగ్గరకూ తీసుకెళ్లి నమస్కరించుకోమని చెబుతుంటారు కదా అలా కొబ్బరి బొండాంపై తాళిబొట్టుని పెట్టి అందరి దగ్గరకు తీసుకెళుతుంటారు..ఆ సందర్భంలో ఆ తాళి తీసుకుని చటుక్కున్న కట్టేస్తాడు హీరో..అప్పుడు కూడా పెళ్లి అంటే ఏంటో తనకు తెలియదు..కేవలం తాళి కడితే కష్టాలు తీరిపోతాయంట కదా అందుకే కట్టానని అమాయకంగా చెబుతాడు. ఈ సన్నివేశాన్ని ఇలా పెట్టాలి అనుకోవడం సాహసం అయితే ఇంత అందంగా విమర్శలకు అందకుండా తెరకెక్కించడం అంతకు మించిన అద్భుతం..


పాట ఇక్కడ చూడొచ్చు 



Also Read: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం


స్వాతిముత్యంలో హీరో ఓ వెర్రిబాగులవాడు.. హీరోయిన్ భర్తను పోగొట్టుకున్న ఓ అమ్మాయి. వీరిద్దరి మధ్య ప్రేమ. కథ చెప్పినప్పుడు ఇది ఎలా వర్క్ అవుట్ అవుతుంది అనుకున్నారు. సాగరసంగమం సినిమా 500 రోజుల ఫంక్షన్ లో ఈ సినిమాలో హీరోగా కమల్ హాసన్ అయితేనే పర్ఫెక్ట్ అని ఆయనకు ఈ కథ వినిపించారు. కమల్ కూడా హీరో పాత్ర ఛాలెంజింగ్ గా అనిపించి వెంటనే ఓకే చెప్పేశారు. అలా తెరకెక్కిన స్వాతిముత్యం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో కమల్ నటన, శివయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు మహాద్భుతం. వాస్తవానికి స్వాతిముత్యం లౌక్యం తెలియని శివయ్య కథ కాదు.. లలిత కథ. పెళ్లంటే ఏంటో తెలియని వయసులో పిల్లాడికి జన్మనిచ్చిన తర్వాత భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన అభాగ్యురాలి కథ. ఈ జీవితం ఇంతే అనుకుని గడిపేస్తున్న సమయంలో పెళ్లి అంటే ఏంటో కూడా తెలీకుండానే తనని వివాహమాడిన ఓ పసిమనసు యువకుడిని ఆదరించి అతనికి తల్లి, భార్య రెండూ తానై  నిలిచి..అనాథగా మిగలాల్సిన అమాయకుడికి పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చిన  స్త్రీ కథ. ఈ కథను ఎంచుకోవడమే సాహసం అయితే..దాన్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం , సాహసం కాక మరేంటి..!


Also Read: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు