K Viswanath Death: బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో విశ్వనాథ్‌ జన్మించారు. ఈ గ్రామంలోనే పది సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తర్వాత విజయవాడకు షిఫ్ట్ అయ్యారని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్నతనంలో విశ్వనాథ్‌ చాలా చలాకీగా ఉండేవారని, ‌ఆటపాటల్లో ముందుండే వారని ఆయన స్నేహితుడు తెలిపారు. వారి కుటుబానికి గ్రామంలో పెద్ద వ్యవసాయ భూములు ఉండేవని.. సినిమాల్లో స్థిరపడి మద్రాస్ షిఫ్టు అయిన తర్వాత గ్రామంలో ఉన్న స్థలాన్ని తనకు విక్రయించారని గ్రామస్థుడు బసవపున్నయ్య వివరించారు. ఆ ఇంటిని కొన్న నాటి నుంచి గతంలో తనకి ఉన్న ఇబ్బందులు తొలిగాయని, ఉద్యోగం కూడా వచ్చి‌‌ జీవితంలో స్థిరపడ్డానని అంటున్నారు. ఎలాంటి కల్మషం లేని మంచి వ్యక్తి విశ్వనాథ్ అని చెబుతూ.. ఆయన ఆశీస్సులతోనే తన కుటుబానికి మంచి జరిగిందని వెల్లడిస్తున్నారు. 




విశ్వనాథ్ లేరన్న వార్త కంటతడి పెట్టిస్తోంది..!


బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం పెద్దపులి వారు గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో విశ్వనాథ్ జన్మించారు. ఆయన ఐదో తరగతి వరకు ఇక్కడే చదువుకుని తర్వాత విజయవాడ వెళ్లారు. సజ్జ బసవపున్నయ్య.. గ్రామంలో ఉన్న విశ్వనాధ్ ఇల్లు కొనుక్కున్నారు. విశ్వనాధ్ ఇంటి ముందు చిన్న కిల్లి కొట్టు పెట్టుకుని బతికేవాళ్లమన్నారు. అప్పుడు అక్కడే విశ్వనాథ్ కు చిన్న పెంకుటిల్లు ఉండేదన్నారు. ఆ ఇల్లు కొన్న తర్వాత తనకు  బాగా కలిసి వచ్చిందని బసవపున్నయ్య చెప్పారు. విశ్వనాథ్‌ పొలాలు కూడా వాళ్ల తాతలు పండించే వారిని వివరించారు. విశ్వనాథ్ లేరన్న వార్త తమను కలచివేస్తోందని కంటతడి పెట్టుకున్నారు. 




ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి..!


ఆయనతోపాటు ఐదో తరగతి వరకు చదువుకున్న వెంకట సుబ్బారావు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన పదో సంవత్సరం వచ్చేదాకా ఇక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. తర్వాత విజయవాడలో వాళ్ల తండ్రి సిమిమా థియేటర్ లో మేనేజర్ గా పనిచేసే వారని గుర్తు చేశారు. తర్వాత వాళ్ల కుటుంబం విజయవాడ వెళ్లిపోయారని, విశ్వనాథ్ కూడా అక్కడే చదువు కొనసాగించాడని చెప్పుకొచ్చారు. తర్వాత విశ్వనాథ్ తండ్రి బి.యన్ రెడ్డితో పరిచయం ఏర్పడడంతో సినిమా ఫీల్డ్ కి పంపించారన్నారు. బంధుత్వం లేకపోయినా ఏరా అన్నయ్య అంటే ఏరా తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే వారని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. కళాతపస్వి చనిపోయారన్న వార్త తమను ఎంతగానో బాధించిందని చెబుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 


అనారోగ్య కారణాలతో మృతి చెందిన కళాతపస్వి


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో మరణించారు. 


సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.
 
తొలి సినిమాకు నంది
'ఆత్మ గౌరవం' సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం', 'శారదా', 'ఓ సీత కథ', 'జీవన జ్యోతి' చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి.